కౌంటింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నం | Engage in counting arrangements in nellore district | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నం

Published Sat, May 18 2019 3:16 PM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM

Engage in counting arrangements in nellore district - Sakshi

నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా ఐదురోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఓట్లను డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించనున్నారు.

తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్కించనున్నారు. డీకేడబ్ల్యూలో ఆరు, ప్రియదర్శిని కళాశాలలో నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంట్‌కు 14 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపు కోసం పది నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 1,200 మంది ఉద్యోగులను నియమించారు. 

19 నుంచి శిక్షణ 
ఉద్యోగులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 19, 20, 21 తేదీల్లో ఇస్తారు. ఎలక్ట్రానిక్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్, ఈవీఎంల్లోని ఓట్లను ఏవిధంగా లెక్కించాలో తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగులు, సిబ్బందిలో కొంతమందిని రిజర్వులో ఉంచనున్నారు. అవసరమైతే వారి సేవలను వినియోగించుకుంటారు. ఉద్యోగులు, సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు వినియోగించేందుకు అనుమతి లేదు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఇతరులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లకు పాస్‌లు ఇవ్వనున్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు.

23వ తేదీన ఉదయం పోటీలో ఉన్న అభ్యర్థులు, అధికారులు స్ట్రాంగ్‌ రూమ్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 8.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా సర్వీస్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్‌లో 14 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండ్‌ వివరాలను సువిధాలో ఆప్‌లోడ్‌ చేసిన తర్వాతే ప్రకటిస్తారు. లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీ ప్యాట్ల స్లిప్‌లు లెక్కిస్తారు. ఈతంతు పూర్తికాగానే విజయం సాధించిన అభ్యర్థిని ప్రకటించి ఆర్‌ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు.

ఆర్‌ఓలకు శిక్షణ 
సర్వీస్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల స్లిప్‌ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆర్‌ఓలకు శుక్రవారం విజయవాడలో శిక్షణ నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్‌ఓలు హాజరయ్యారు.   

ప్రత్యేక ఏర్పాట్లు  

  •  కౌంటింగ్‌ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలోకి బయటి వ్యక్తులు వెళ్లకుండా కర్రలతో బ్యారికేడ్లు కడుతున్నారు. 
  •  పార్టీల ఏజెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. 
  •  సెల్‌ఫోన్లు కేంద్రంలోకి తీసుకురావడానికి అనుమతి లేదు. వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 
  •  వాటర్‌ బాటిల్స్, ప్యాకెట్లు ఈవీఎంలపై పోసే అవకాశం ఉన్నందున వాటిని కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
  •  ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్‌ వద్దనే ఉండాలి. అటూ ఇటూ తిరగడానికి వీల్లేదు. వారికి అవసరమైన తాగునీరు తదితర ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది. 
  • ప్రత్యేక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. 
  •  ఉద్యోగులు, సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ద్వారా నియమించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement