ఇంజినీరింగ్ విద్యార్థుల ఆత్మహత్య
► పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం
► పెళ్లైన 24 గంటల్లోపే రైలు కిందపడిన వైనం
► అవయవాలు దానం ఇవ్వాలని ఫోన్‌లో విజ్ఞప్తి
► ఇరు కుటుంబాల్లో నెలకొన్న విషాదం
చీరాల : వారిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. కలిసి బతకాలన్న ఆ జంట ఆకాంక్షకు కులాలు అడ్డు వచ్చాయి. పెద్దలను ఎదిరించలేక ఆ జంట కలిసికట్టుగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సరిగ్గా 24 గంటల ముందు ఓ గుడిలో వివాహం చేసుకుని దంపతులయ్యారు. హృదయ విదారకమైన ఈ సంఘటన మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లాలోని వేటపాలెం రైల్వేస్టేషన్‌లో జరిగింది. చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బత్తుల సందీప్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
అదే కాలేజీలో గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన మౌనిక రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ అగ్రకులాల వారే. అయినా కులాలు వేరు కావడంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ప్రేమను వదులుకోకుంటే చనిపోతామని పెద్దలు బెదిరించారు. దీంతో కన్నవారిని ఎదిరించలేక ఇద్దరూ కుమిలిపోయారు. తాము ప్రాణాలు వదిలినా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని భావించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తలచారు. ఆత్మహత్యకు ముందు ఒక్క క్షణమైనా దంపతులుగా జీవించాలని భావించారు. విజయవాడ వెళ్లి అక్కడ ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్ చేరుకున్నారు.
స్నేహితుడికి ఫోన్ చేసి..
పెళ్లి విషయాన్ని సందీప్ తన స్నేహితుడికి ఫోన్‌లో తెలియజేశాడు. పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఈ విషయాన్ని ఇరువర్గాల పెద్దలకు చెప్పాలని కోరాడు. తమ అవయవాలు ఇతరులకు దానం ఇవ్వాలని కోరాడు. సంఘటన జరిగిన వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ప్రాథేయపడ్డాడు.
తలలు మాత్రమే పట్టాలపై ఉంచి..
సందీప్, మౌనిక తలలు మాత్రమే పట్టాలపై ఉంచి పడుకున్నారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. స్నేహితులు వెంటనే చీరాల జీఆర్పీ ఎస్‌ఐ జి.రామిరెడ్డికి చెప్పడంతో ఆయన తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. సందీప్ మొబైల్ ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
మిన్నంటిన రోదనలు
ప్రేమికుల మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఉదయం ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. ఉన్నత చదువులతో తమ కలలను నిజం చేస్తారన్న వారు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులు తమ తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు.
తల్లడిల్లిన మౌనిక తల్లిదండ్రులు...
అమృతలూరు(వేమూరు) : వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండల గ్రామం మోదుకూరు గ్రామానికి చెందిన గోగిరెడ్డి పెద్దిరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిది వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిన్న కుమార్తె మౌనిక తమ కళాశాలలో చదువుతున్న సందీప్‌ను మంగళవారం ఉదయం విజయవాడలో వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఆ నవజంట సందీప్ ఇంటికి వెళ్లారు. వారిని చూసి తల్లిదండ్రులు క్రోపోద్రిక్తులయ్యారు. ఇంటి నుంచి గెంటేశారు. దీంతో వివాహమై పట్టుమని 10 గంటలు కూడా కాకముందే వారు లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. వేటపాలెం సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమార్తె అర్ధంతరంగా మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.