అనంతపురం (పుట్టపుర్తి) : ఓ ఇంజినీరింగ్ విద్యార్థి చిత్రావతి నదిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పెడపల్లి పెద్దతండాకు చెందిన బీటెక్ విద్యార్థి గణేష్‌నాయక్(22) శనివారం స్నేహితులతో కలిసి చిత్రావతి నదికి ఈతకు వెళ్లాడు. ఇటీవల కురిసిన వర్షాలకు చెక్‌డ్యాం పూర్తిగా నిండిపోయింది. చెక్‌డ్యాం నుంచి కొంత దూరంలో రెండు పెద్ద రాళ్లు ఉన్నాయి. అంతా కలిసి డ్యాం నుంచి రాళ్ల మధ్య అటూ ఇటూ ఈత కొట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇళ్లకు తిరుగుముఖం పట్టాలని భావించారు. అయితే స్నేహితులంతా సురక్షితంగా బయటకు వచ్చేసినా.. గణేష్ మాత్రం రాళ్ల వద్ద నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఆయాసంతో ఈదలేక మునిగి పోయాడు. స్నేహితులు గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో గ్రామస్తులకు సమాచారమిచ్చారు. పుట్టపర్తి నుంచి అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి గాలించారు. సుమారు ఐదు గంటల పాటు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో తహశీల్దార్ ద్వారా కలెక్టర్‌కు సమాచారమిచ్చారు.