ఇంగ్లిషు మీడియం పాఠశాలగా ఎంపికైన చిత్తూరులోని నాయీబ్రాహ్మణ ప్రాథమిక పాఠశాల
గతంలో: సర్కారు బడుల్లో ఏముంది..? సార్లు చెప్పే తెలుగు మీడియం పాఠాలు వినేదెవరు..? ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే పిల్లలు నాలుగు ఇంగ్లిషు ముక్కలు నేర్చుకుంటారు.
ప్రస్తుతం: మన ఊర్లోనే .. మన బడిలోనే ఇంగ్లిషు చెబుతున్నారు. ఇకపై ప్రైవేటు బడులకు పిల్లలను పంపడమెందుకు..? అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవడమెందుకు..?
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ఈ ఏడాది 492 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటి వరకు ఈ పాఠశాలల్లో 5 వేల మందికి పైగా విద్యార్థులు చేరారు. నిన్న మొన్నటి వరకు ప్రీప్రైమరీ తరగతులపై కొంత ఊగిసలాట ఉన్నా, ఇప్పుడు అధికారులు టీచర్లకు భరోసానిచ్చారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట విద్యావలంటీర్లను నియమించడానికి కసరత్తు చేపడుతున్నారు.
ఆసక్తులకు అనుగుణంగా..
పిల్లలను ఇంగ్లిషు మీడియంలోనే చదివించాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఆ పాఠశాలలు మూతపడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఇంగ్లిషు మీడియంలో బోధించేందుకు మక్కువ చూపుతున్న టీచర్ల స్కూళ్లకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది. టీచర్ల ఆసక్తి, పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉన్న పాఠశాలలకు అనుమతులిచ్చారు. మూడేళ్లపాటు పంచాయతీలే వాటి నిర్వహణ చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు మొగ్గుచూపుతున్నారు.
5వేల మంది విద్యార్థులు..
జిల్లాలో 4,106 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుండగా, అందులో డీఈఓకు 1,576 మంది ఇంగ్లిషు మీడియం కావాలని వినతి చేసుకున్నారు. అందులో డీఈఓ 1279 పాఠశాలలను అంగీకరించి రాష్ట్ర శాఖకు నివేదికలు పంపారు. వాటిలో రాష్ట్ర విద్యాశాఖ 40 మంది విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి 492 పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు అనుమతులిచ్చింది. ఈ పాఠశాలల్లో ఇప్పటివరకు సుమారు 5వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. దీంతో ఈ ఏడాది ఒకటో తరగతిలో ఇంగ్లిషు మీడియం తరగతులు నిర్వహించనున్నారు.
ఇంగ్లిషు మీడియంపై ఆసక్తి..
జిల్లాలో 492 పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు పంపి వేలకు వేలు ఖర్చు చేసుకునేకన్నా.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియంకు పిల్లలను పంపిద్దామన్న మార్పు తల్లిదండ్రుల్లో వస్తోంది. – డాక్టర్ పాండురంగస్వామి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment