
బాధిత కుటుంబానికి చెక్కు అందిస్తున్న జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేడీ విజయభారతి
సాక్షి, అమరావతి బ్యూరో: వ్యవసాయంలో తీవ్ర నష్టాలకు గురై అప్పుల బాధను తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో రైతు బలుసు అప్పారావు (45), ఆయన భార్య వాణి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయమే దంపతుల ఆత్మహత్యపై ఆరా తీసి, సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.7 లక్షల చెక్కును అందించి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి.. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌కు విషయం తెలిపి బాధిత కుటుంబం వద్దకే వెళ్లి చెక్కు అందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయభారతితోపాటు అధికార యంత్రాంగం బుధవారం దుర్గికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న అప్పారావు తల్లి వెంకటరావమ్మ, పిల్లలు హేమంత్ (12), హర్షిత (10)లను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సీఎం ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చెక్కును అందజేశారు.
గతంలో పరిహారం రూ.5 లక్షలు మాత్రమే..
గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలను సీఎం సహాయనిధి నుంచి అందించేవారు. మృతుల కుటుంబీకులు పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి పరిహారం వచ్చేందుకు దాదాపు ఏడాది నుంచి రెండేళ్లు పట్టేది. మండల కమిటీ, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కమిటీ, జిల్లా కలెక్టర్.. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు నివేదిక పంపడం, మళ్లీ దీన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపి, అక్కడ నుంచి నగదు వచ్చాక బాధిత కుటుంబానికి చెక్కు ఇచ్చేవారు. అయితే.. సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేక, నీటి కొరతతో పంటలు పండక, సాగు కోసం చేసిన అప్పులు తడిసిమోపెడై గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల కన్నీటి గాథలను విన్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పరిహారం పెంచి వైఎస్సార్ బీమా అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. ఈ హామీ మేరకే మరణించిన రైతు దంపతుల కుటుంబానికి సంఘటన జరిగిన 24 గంటల్లోనే రూ.7 లక్షలు అందించారు.
సీఎం ఆదేశాల మేరకు రూ.7 లక్షలకు పెంచాం..
సీఎం ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చెక్కు అందించాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. గతంలో రూ.5 లక్షలుగా ఉన్న పరిహారాన్ని సీఎం ఆదేశాల మేరకు రూ.7 లక్షలకు పెంచాం.
– శామ్యూల్ ఆనందకుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్