
అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్
హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీ మరోసారి అరగంటపాటు వాయిదా పడింది. అంతకు ముందు వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను సభలో ప్రవేశపెట్టారు. శాసనసభ కార్యదర్శి సదారాం బిల్లులోని అంశాలను చదివి వినిపించారు.
శాసనసభ వెబ్సైట్లో బిల్లు ప్రతిని ఉంచామని, తెలుగు, ఉర్దూ అనువాద ప్రతులను సభ్యులకు అందుబాటులో ఉంచినట్లు స్పీకర్ తెలిపారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. తమ నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు. దాంతో స్పీకర్ సభను రెండోసారి వాయిదా వేశారు. ఇక శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో మండలి ఛైర్మన్ చక్రపాణి సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.