రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఆవరణలోనేగాక సమావేశం మందిరంలోనూ ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వైపుకానీ, ఇతరుల సీట్లవైపు కానీ వెళ్లకుండా అడ్డుకునేలా మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ లాబీల్లోనేగాక సమావేశ మందిరంలోపలా భారీఎత్తున మార్షల్స్‌ను మోహరించారు. గతంలో మార్షల్స్‌ను గుర్తుపట్టేందుకు వీలుగా ప్రత్యేక డ్రెస్సు, చేతులకు బ్యాడ్జీలను ధరించేలా చూసేవారు. ఈసారి అలా గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఏకంగా ఎమ్మెల్యేల్లో కలిసిపోయేలా ఖద్దరు దుస్తుల్లోనే వారిని సమావేశ మందిరంలోకి ప్రవేశపెడుతుండడం విశేషం.