ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : పేదల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన్న ఎన్నో సంక్షేమ పథకాలకు ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు పథకం ప్రకారం తూట్లు పొడిచారు. పేదల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలను మహానేత తర్వాత వచ్చిన పాలకులు నిర్వీర్యం చేశారు. నడిరోడ్డుపై రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రులను క్షణాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లి వారి ప్రాణాలు కాపాడేందుకు రూపొందించిన 108 పథకం ప్రస్తుతం కునారిల్లుతోంది. కాలం చెల్లిన వాహనాలు, ఆరకొర వసతులు ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మార్చాయి.
ఈ మధ్య జరిగిన సంఘటనను పరిశీలిస్తే ప్రజారోగ్యానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవా.. అని ఆశ్చర్యం వేయక తప్పదు. ఇటీవల మర్రిపూడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 108కి సమాచారం అందడంతో అరగంట తర్వాత అంబులెన్సు వచ్చింది. క్షతగాత్రలకు ఆక్సిజన్ అందించేందుకు చూస్తే 108 అంబులెన్సులో ఆక్సిజన్ లేదు. మరో వాహనం వచ్చినా ఆ వాహనం తలుపులు తేరుచుకొలేదు. ఆక్సిజన్.. సకాలంలో వైద్యం అందక క్షతగాత్రుల్లో ఒకరు మరణించారు. ఇది.. జిల్లాలో ఉన్న అంబులెన్సుల పరిస్థితి. ఇలాంటి సంఘటనలు నిత్యం జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట జరుగుతోందంటే ఆశ్చర్యం వేయక మానదు.
మహానేత పాలనలో..
మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక 2005లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 108 వాహనాల సేవలను తెరపైకి తీసుకొచ్చారు. వైఎస్సార్ బతికున్నంతా కాలం కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ 108 వాహనాలు రోడ్లపై క్షణాల్లో వాలిపోయేవి. ఆయన మారణానంతరం వాటిని పట్టించుకునే వారు లేక అవి కునారిల్లుతున్నాయి. జిల్లాలో మొత్తం 56 మండలాలు ఉన్నాయి. మండలానికి కనీసం ఒకటి చొప్పున వాహనం ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 32 అంబులెన్సులనే కేటాయించారు. కొద్ది రోజుల తర్వాత కొన్ని మరమ్మతులకు గురికాగా ప్రస్తుతం వాటిని కుడా లెక్కలోనే చూపుతున్నారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం 3 వాహనాలు మాత్రమే జిల్లాకు వచ్చాయంటే అతిశయోక్తి కాదు.
సమస్యలివిగో..
ఒక్కో వాహనంలో ముగ్గురు సాంకేతిక నిపుణులు, ముగ్గురు పెలైట్లు ఉండాలి. ప్రతి 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున 24 గంటలూ ముగ్గురు వాహనంలో ఉండాలి. కానీ ప్రతి 108 వాహనానికి ఇద్దకు సిబ్బందిని మాత్రమే నియమించారు. 108 వాహనాల్లో ఆక్సిజన్ కూడా ఉండటం లేదు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని వాహనాల తలుపులు కూడా సకాలంలో తెరుచుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. టైర్లు ఎప్పుడు బరస్టు అవతాయో కూడా అర్థం కావడం లేదు. వాహనాలన్నీ పాతవే. 108 సేవల పేరుతో ప్రజాధనం లక్షల్లో దుర్వినియోగమవుతోంది. తొలుత జీఎంఆర్, ప్రస్తుతం జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థలు 108 నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి. 108 సేవలకుగానూ ఒక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు లక్షా 13 వేల రూపాయలు చెల్లిస్తోంది.
‘108’కు సుస్తీ
Published Thu, May 1 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM
Advertisement