సాక్షి, విజయవాడ/గుంటూరు: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో నిందితుల రెండో రోజు విచారణ ముగిసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విచారించారు. ఉదయం నుంచి రెండు దఫాలుగా 5 గంటల పాటు అధికారులు అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. డొల్ల కంపెనీలకు ఆర్డర్లు, పరికరాల కొనుగోలు గోల్‌మాల్‌పై అధికారులు ప్రశ్నలు సంధించారు. సిఫార్స్ లేఖపై కూడా ఆయనను ప్రశ్నించారు. ఈ స్కామ్ వెనక ఎవరి ఒత్తిడి ఉందనే అంశంపై కూడా అధికారులు విచారణ చేపట్టారు. 150 కోట్ల రూపాయల అవినీతిలో వాటాలపై కూడా సమాచారం సేకరించేందకు ప్రయత్నించారు. కాగా, శనివారం కూడా అధికారులు అచ్చెన్నాయుడును ప్రశ్నించనున్నారు.
మరోవైపు ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు రమేష్‌కుమార్, విజయ్‌కుమార్, చక్రవర్తి, జనార్దన్‌లను కూడా ఏసీబీ అధికారులు విజయవాడలో ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలో ఒక్కొక్కరిని ఏసీబీ బృందం విడివిడిగా ప్రశ్నించింది. రూ. 150 కోట్లలో ఎవరి వాటా ఎంత?, ఎవరి ఒత్తిడితో తప్పు చేశారు?, స్కామ్‌లో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది?.. వంటి ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన రెండు ఎఫ్‌ఐఆర్‌లపై విచారణ కొనసాగించారు. విచారణ సందర్భంగా అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్టు సమాచారం. ఇక, నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి పరారీలో ఉన్న మరో 10 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment