తిరుపతికి మరో మణిహారం | Establishment Of Telugu Sanskrit Academy In Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతికి మరో మణిహారం

Published Fri, Jun 12 2020 8:33 AM | Last Updated on Fri, Jun 12 2020 8:33 AM

Establishment Of Telugu Sanskrit Academy In Tirupati - Sakshi

ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన ఏపీ కేబినెట్‌ మీటింగ్‌ రాష్ట్రంలో ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ద్వారా తెలుగు సంస్కృత అకాడమీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

సాక్షి, తిరుపతి‌: ఏపీ, తెలంగాణాల అధికార భాష తెలుగు. సుమారు 9 కోట్ల మందికి తెలుగు మాతృభాషగా ఉంది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి, తెలుగు భాషలో పాఠ్యాంశాల తయారీ, ప్రచురణ, తెలుగు సాహిత్యంపట్ల అవగాహన పెంచి ప్రొత్సహించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా అనేక పాఠ్యపుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. అలాగే వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో సదస్సులు, సెమినార్లు నిర్వహించేవారు. ఈ అకాడమీ ద్వారా డిగ్రీ స్థాయి వరకు అనేక ప్రామాణిక పుస్తకాలు తీసుకొచ్చారు.

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక తెలుగు అకాడమీ ఇంకా విడిపోలేదు. రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా ఉంది. సుమారు 400 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఏపీలో 58 శాతం నిధులు రావాల్సి ఉంది. 2014–2019 వరకు అధికారంలో కొనసాగిన టీడీపీ ప్రభుత్వం దీని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలుగు అకాడవీుకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకున్నారు. లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్మ న్‌గా నియమించారు. ప్రభుత్వం తెలుగు భాష, సంస్కృతిని అకాడమీతో కలిపి తెలుగు సంస్కృత అకాడమీ పేరిట రాష్ట్రస్థాయి సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేయాలని గురువారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ర్యాంకులు ఇలా..

ఇప్పటికే ప్రాంతీయ కేంద్రం
తెలుగు అకాడవీుకి ఏపీలో 5 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. తిరుపతి, అనంతపురం, గుంటూరు, విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తిరుపతిలో కోర్టు ఎదురుగా ఉన్న కోదండరామ హైసూ్కల్లో ప్రాంతీయ కేంద్రం పని చేస్తుంది.
 
తిరునగరికి మరో కలికితురాయి..
తిరుపతిలో ఎస్వీయూ, మహిళావర్సిటీ, వేదిక్, వెటర్నరీ, సంస్కృత వర్సిటీ, ఐఐటీ, ఐసర్‌ తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. అలాగే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు పరిరక్షణ సమితి, తెలుగు భాషా వికాస వేదిక తదితర సంస్థలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పని చేస్తున్నాయి. తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతరకు రాష్ట్రంలో ఎంతో గుర్తింపు ఉంది. అలాంటి తిరుపతి నగరంలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు పట్ల తెలుగు భాష ప్రేమికులు, సాహితివేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో మంచి నిర్ణయం
తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తిరుపతి లో తెలుగుసంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలని  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రాయలసీమ ప్రాంతంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో గుర్తింపు లభిస్తుంది. 
– జే ప్రతాప్‌ రెడ్డి, ప్రొఫెసర్, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌ 

తెలుగు భాష, సంస్కృతికి మేలు
తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పా టు చేయడం వల్ల తెలుగుభాష, సంస్కృతికి మే లు చేకూరుతుంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఆధ్యాత్మికతకు సంస్కృతి, భాష తోడైతే తెలుగు సంస్కృతి, భాషకు ఉన్నత స్థితి లభిస్తుంది. తెలుగు ప్రజలకు గుర్తింపు దక్కుతాయి.    
– డాక్టర్‌ గెంజి అరుణ, అసోసియేట్‌ ప్రొఫెసర్, భాషోత్పత్తి శాస్త్రం, ఎస్వీయూ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement