రామతీర్థం క్షేత్రానికి మంచి రోజులు | Estanlishing Of Ramathirtham temple Trust Board | Sakshi
Sakshi News home page

రామతీర్థం క్షేత్రానికి మంచి రోజులు

Published Wed, Oct 2 2019 9:21 AM | Last Updated on Wed, Oct 2 2019 9:21 AM

Estanlishing Of Ramathirtham temple Trust Board  - Sakshi

రామతీర్థం దేవస్థానం 

సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం)  : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామివారి దేవస్థానానికి మంచి రోజులు రానున్నాయి. ఇక్కడ పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వార్షిక ఆదాయం రూ. కోటి నుంచి రూ.20 కోట్లు ఉన్న అన్ని దేవాలయాలకు పాలక మండళ్ల ఏర్పాటుకు అనుమతిస్తూ దేవదాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. హిందూ ధార్మిక సంస్థ, ట్రస్టుల చట్టం– 1987 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రముఖ దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ఉన్న శ్రీరాముడి దేవాలయానికి కూడా పాలక మండలి ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి ఏర్పాటుతో దేవస్థానానికి మంచి రోజులు రానున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో పెనుమత్స సాంబశివరాజు మంత్రిగా ఉన్నప్పుడు పాలక మండలి ఉండేది. అయితే 2007 నుంచి దేవస్థానానికి పాలక మండలి లేదు. తాజా ఉత్తర్వులు ప్రకారం అక్టోబర్‌ 20వ తేదీ లోపు ఆసక్తి గల సభ్యులు ఆలయ సహయ కమిషనర్‌కు దరఖాస్తు అందజేయాల్సి ఉంది. 

ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు ఇలా..
నిబంధనల ప్రకారమే నియామకాలు ఉంటాయని దేవదాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేవస్థానానికి ఎక్స్‌ అఫీషియో సభ్యుడు, తొమ్మిది మందితో ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆలయ ధర్మకర్త ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఈ దేవాలయానికి వ్యవస్థాపక ధర్మకర్తగా మాజీ ఎంపీ పూసపాటి ఆశోక్‌గజపతిరాజు వ్యవహరిస్తున్నారు. అలాగే నిబంధనల ప్రకారం పాలక మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన జీఓ అందిందని, పూర్తి విధి విధానాలు ఇంకా దేవదాయ, ధర్మదాయ శాఖ నుంచి రావాల్సి ఉందని దేవస్థాన ఉద్యోగి తులసి తెలిపారు.

రూ. కోటి పైగా ఆదాయం
రామతీర్థం దేవస్థానానికి వార్షిక ఆదాయం రూ. 1.50 కోట్ల నుంచి రూ. 1.80 కోట్లు వస్తుంది. అన్ని వనరులు సక్రమంగా ఉన్నప్పటికీ దేవస్థాన అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పైగా 2007 నుంచి ధర్మకర్తల మండలి లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించేవారనే భక్తుల నుంచి ఆరోపణలు వినిపించేవి. ప్రసాదాల పంపిణీ, తయారీ విషయాల్లోనూ నాణ్యత పాటించకపోవడంపై ఇప్పటికీ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యన్నదానం, స్వామివారి భోగం, పులిహోరా ప్రసాదాల కోసం సరుకుల పంపిణీకి టెండర్లను ఎప్పటికప్పుడు పిలుస్తున్నారు. అయితే ప్రతి ఏటా శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యాపారి టెండర్‌ను దక్కించుకుంటున్నారు. ఈ టెండర్‌ విధానం వల్ల సరుకులు నాణ్యమైనవి రావడం లేదని ఇక్కడ సిబ్బందే చెబుతుండటం గమనర్హం. అలాగే ప్రస్తుతం దేవస్థానంలో ఉచిత పంపిణీ ప్రసాదం కూడా లేదని భక్తులు రోజూ విమర్శిస్తున్నారు. దేవస్థానంలో కనీసం మినీ వాటర్‌ ట్యాంక్‌లు కూడా శుభ్రం చేయకపోవడంతో నీటిలో విష పురుగులు దర్శనమిచ్చాయి. గత నెలలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో జిల్లావ్యాప్తంగా సంచలనమైంది. పాలక మండలి ఏర్పాటైతే ఇటువంటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉండదని భక్తులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement