కోయిల్‌కొండ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు అభివృద్ధికి పెద్దపీట వేస్తామని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.హరీష్‌రావు అన్నారు. జిల్లాలో వెనకబడిన నారాయణపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అలాగే దళితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలను అమలుచేస్తామన్నారు.
శుక్రవారం మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు వలస జిల్లాగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. తెలంగాణ రావాల్సిన నీళ్లను కడపకు దొచికెళ్లిన ఘనత సీమాంధ్ర నాయకులకే దక్కిందన్నారు. పక్కనే కృష్ణానది ఉన్నా సాగు, తాగునీటి కోసం ఈ జిల్లా ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రత్యేకఏర్పాటైతే జిల్లాలోని అన్ని మండలాలకు సాగు, తాగునీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ ఊసెత్తని ఎమ్మెల్యేలు సీతమ్మ, దయాకర్‌రెడ్డి ఏ మొఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల రైతులకు వ్యవసాయ విద్యుత్ సక్రమంగా అందించి కాల్వల ద్వారా లక్షల ఎకరాలను సాగునీరు అందిస్తామన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం 14ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కోయిల్‌కొండ మండలాన్ని మహబూబ్‌నగర్ నియోజవకవర్గంలో కలిపేందుకు కృషిచేస్తామన్నారు. ఈ సందర్భంగా మండలంలోని మల్కాపూర్, కోయిల్‌కొండ, పారుపల్లి, కోత్లాబాద్, సురారం, అభంగపట్నం తదితర గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు టి.హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, దేవరిమల్లప్ప, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
సమైక్యారాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో దోపిడీ
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: సమైక్యరాష్ట్రంలో ప్రైవేట్‌రంగం దోపిడీకి గురైందని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ప్రైవేట్ ఉద్యోగుల గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 83 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలు కోల్పోతే ప్రైవేట్ రంగంలో సీమాంధ్రుల దోపిడీకి అంతేలేకుండాపోయిందన్నారు. భూములు తెలంగాణవి ఉద్యోగాలు ఆంధ్రవి, కాలుష్యం తెలంగాణకు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో టీఆర్‌ఎస్ భాగస్వామ్యం అవుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలుచేసిన తెలంగాణ ఏర్పడటం ఖాయమన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలను రద్దుచేస్తామన్నారు. ప్రైవేట్‌రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు.
టి.ప్రైవేట్ ఉద్యోగుల సంఘం
కార్యాలయం ప్రారంభం
తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల నూతన కార్యాలయాన్ని టి. హరీష్‌రావు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన టీజేఏసీ రాష్ట్ర కోచైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకుంటున్న ద్రోహులకు నిలువనీడ లేకుండా చేస్తామన్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేక తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐక్యంగా ఉండి తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, సయ్యద్ ఇబ్రహీంలు మాట్లాడుతూ.. తెలంగాణ సాధించే వరకు టీఆర్‌ఎస్ విస్మరించదన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి తీరుతామని, రేపటి తెలంగాణ పునర్‌నిర్మాణంలో కూడా టీఆర్‌ఎస్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శాంతిభూషణ్, నర్సింహా, బెక్కం జనార్దన్, డాక్టర్ సి.అమరేందర్, జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కన్వీనర్ రామకృష్ణగౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు ప్రగతికి పెద్దపీట
Published Sat, Jan 4 2014 3:16 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement