సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వ్యవహారంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయడం వెనుక తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అదృశ్య హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వెల్లడించారు. ప్రజల్లో అత్యంత ఆదరణ గల నేతను విభజన కోసం సోనియా ఒత్తిడి చేశారన్నారు. తెలంగాణ నాన్-గెజిటెడ్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో గురువారం జరిగింది.
ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను మొదట్లో సమైక్యవాదినేనని, 72లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం తర్వాతే విభజన వాదిగా మారానని చెప్పారు. తెలంగాణ కోసం తాను నిర్వహించిన పరిమితమైన పాత్రను ఎవ్వరికీ చెప్పబోనని, కేవలం ఆత్మకథలోనే వివరిస్తానని వెల్లడించారు. రాష్ట్ర సాధన దిశగా సాగిన ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. సమైక్య వాదం భావన ఉదాత్తమైనదని, అయితే అది ఏకపక్షం కావడమే విమర్శలకు కారణమవుతోందన్నారు. తెలంగాణకు లాభం జరిగి, సీమాంధ్రకు నష్టం కల్గించే ఏ విధానాన్ని అంగీకరించబోనని జైపాల్ తెలిపారు.
ఆధిపత్యం చూపితే ఉద్యమం: దామోదర
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయం జరగాలని, అందుకు విరుద్ధంగా కుల ఆధిపత్యం చూపితే మరో ఉద్యమం ఖాయమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. హైదరాబాద్‌లో భద్రతపై సీమాంధ్రుల ఆందోళన అర్థరహితమని, ఇన్నేళ్ళుగా ఇందుకు సంబంధించి ఒక్క సంఘటన అయినా జరిగిందా అని ప్రశ్నించారు.
బిల్లుకు మద్దతు: విద్యాసాగర్ రావు
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు స్పష్టంచేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం విభజనకు అంగీకరించినప్పుడు అసెంబ్లీలో సీఎం అవగాహనరాహిత్యంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఎన్‌జీవో 2014 డైరీని దామోదర రాజనర్సింహ, క్యాలెండర్‌ను జైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ వివేక్, తెలంగాణ రాజకీయ జెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ తదితరులు పాల్గొన్నారు. టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు సభకు అధ్యక్షత వహించారు.