టెన్త్‌లో ప్రతిభావంతులకు అందని ప్రోత్సాహక నగదు
ఒక్కో విద్యార్థికి రూ.20 వేలు ఇస్తామన్న ప్రభుత్వం
నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకోని విద్యాశాఖ
పదోతరగతి విద్యార్థుల ప్రోత్సాహమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రతిభా అవార్డులు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రశంసా పత్రాలతోపాటు ఒక్కో విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. నాలుగు నెలల క్రితం తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి రాష్ట్రంలోని 13 జిల్లాల విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అయితే ఇంతవరకు నగదు బహుమతి ఇవ్వలేదు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదనకు లోనవుతున్నారు.
చిత్తూరు : ప్రతిభా అవార్డులక ఎంపికైన విద్యార్థుల పట్ల ప్రభుత్వం తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 2015 ఏడాది పదోతరగతి పరీక్షల్లో అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ప్రతిభా అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 4,050 మంది విద్యార్థులకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి ఒక్కో మండలం నుంచి ఆరుగురు చొప్పున 402 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరు, ఇద్దరు బీసీ విద్యార్థులు, ఇతరులు ఇద్దరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతిభా అవార్డుకింద ఒక్కో విద్యార్థికి ప్రశంసా పత్రంతోపాటు రూ.20 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు స్వీకరించే విద్యార్థితో పాటు వచ్చిన ఉపాధ్యాయుడి కూడా రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తామని చెప్పింది. గత ఏడాది నవంబర్ 14న తిరుపతిలో ఆర్భాటంగా ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ సభ నిర్వహించారు. భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులందరితోపాటు వారి కుటుంబ సభ్యులనూ అక్కడికే పిలిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన వసతులు కూడా ఏర్పాటుచేయలేదు.
దీంతో వారు నానా తంటాలు పడ్డారు. విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. నగదు మొత్తాన్ని తరువాత విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని అధికారులు ప్రకటించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఎంపికైన 402 మంది విద్యార్థులకు రూ.80.40లక్షలు, రవాణా ఖర్చుల కింద ఉపాధ్యాయులకు మరో రూ.4.92 లక్షలు కలిపి మొత్తం రూ.85లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే జమ చేయాల్సి ఉంది. కార్యక్రమం జరిగి ఇప్పటికి నాలుగు నెలలు పూర్తయింది. కానీ ప్రభుత్వం ఏ ఒక్క విద్యార్థికి కూడా పైసా చెల్లించలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇదేనా ప్రోత్సాహం అంటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రశంసలతో సరి!
Published Wed, Mar 23 2016 2:07 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement