రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ క్లూస్ కలెక్షన్ టీమ్‌ల ఏర్పాటు ద్వారా నేరస్తుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ క్లూస్ కలెక్షన్ టీమ్‌ల ఏర్పాటు ద్వారా నేరస్తుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ప్రతి స్టేషన్‌లోనూ క్లూస్ టీమ్‌లు, లైవ్ స్కానర్లను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. క్లూస్ టీమ్‌లు ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఉన్నాయి. దూరప్రాంతంలోని నేర స్థలానికి చేరుకోవడంలో జాప్యమవుతోంది. దీనివల్ల కొన్ని ఆనవాళ్లు దొరక్క నిందితుల గుర్తింపు కష్టమవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రతి పోలీస్ స్టేషన్‌కూ ఒక క్లూస్ కలెక్షన్ కిట్‌ను అందించి, ఇద్దరు కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఒక్కో క్లూస్ కిట్ ఖరీదు రూ. 25 వేల వరకు ఉంటుంది. రాష్ట్రంలోని 1,680 స్ట్టేషన్లకు కిట్‌లు అందించడానికి రూ.4.2 కోట్లు అవసరమని పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.