
'మోడీ వస్తాడు... దేశాన్ని రక్షిస్తాడు'
వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశ ప్రధాన పీఠాన్ని అధిష్టిస్తారన్నారు. మోడీ వస్తాడు. .. దేశాన్ని రక్షిస్తాడని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... నరేంద్రమోడీయే దేశ ప్రధాని అన్న భావన రోజురోజూకు దేశవ్యాప్తంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనాకర్షణ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయాయని తెలిపారు. ఆహార భద్రత... కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భద్రత కల్పించ లేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిందనేందుకు అత్యుత్తమ ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ బిల్లుపై స్పష్టత ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలకు కలిగిన అనుమానాలను నివృతి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేవారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే క్రమంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.