
యోగా డేకి అంతా రెడీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బందరురోడ్డులోని ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం నిర్వహించనున్న ప్రత్యేక యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి...
సీఎం చంద్రబాబునాయుడు రాక
విజయవాడ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బందరురోడ్డులోని ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం నిర్వహించనున్న ప్రత్యేక యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 7 నుంచి 7.33 గంటల వరకు జరుగుతుంది.
దేశవ్యాప్తంగా యోగాసనాలు నిర్వహించే ప్రక్రియలో భాగంగా జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు రెండువేల మంది బాలబాలికలు రకరకాల ఆసనాలు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టర్ బాబు.ఎ పరిశీలించారు. కార్యక్రమం గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.
తొలుత ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని స్క్రీన్లపై చూపిస్తారని, అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చే వివిధ పాఠశాలల విద్యార్థులు ఉదయం 6 గంటలకే ఎ.కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్‌తోపాటు మేయర్ కోనేరు శ్రీధర్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, జిల్లా క్రీడాధికారి వి.రామకృష్ణ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం మంత్రులు వేదికను పరిశీలించారు.
వేదిక : బందరురోడ్డులోని ఎ.కన్వెన్షన్ సెంటర్
సమయం : నేటి ఉదయం 7 నుంచి 7.33 గంటల వరకు