ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. కోర్టు ఆదేశించడంతో ఆ పోస్టుల పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం 2,606 మంది రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నెలరోజుల్లోగా వారికి నియామక పత్రాలు అందజేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆయన ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 4,56,983 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 97,706 మంది శరీర దారుఢ్య పరీక్షలు అధిగమించి రాత పరీక్షకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు.
రాత పరీక్షలో 2,606 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశామన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో 840 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. 1994 నాటి ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకాల్లో అర్హత సాధించిన వారి కోసం 265 పోస్టులను రిజర్వ్ చేసి ఉంచామని, కోర్టు తుది తీర్పు అనంతరం వారికి నియామకపత్రాలు జారీ చేస్తామని మంత్రి వివరించారు. కానిస్టేబుళ్ల ఫలితాలను ఛిఞ్ఛ.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
దాదాపు 20 ఏళ్ల అనంతరం
1994లో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ, నియామక ప్రక్రియ చివరిదశకు వచ్చిన తరువాత అర్ధంతరంగా నిలిపివేశారు. అప్పటి నుంచి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్ల నియామకాల ఊసేలేదు. వైఎస్సార్ రెండోసారి సీఎం అయిన తరువాత 1,600 పోస్టుల నియామకానికి సన్నద్ధమయ్యారు. కానీ, ఆయన మరణించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చివరకు 2012 నవంబర్‌లో 2,606 పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షల నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూకు అప్పగించారు. దేహదారుఢ్య పరీక్షలలో అర్హత సాధించిన వారి వివరాలను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో పెట్టారు. అయితే, ఫలితాలు వెలువడే సమయానికి 1994 బ్యాచ్‌కు చెందిన అభ్యర్థులు తమకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన కోర్టు నియామకాల్లో 1994 బ్యాచ్ అభ్యర్థులకు ఖాళీలు ఉంచాలని చెప్పడంతో.. తాజాగా ఫలితాలు విడుదల చేశారు.