కొత్త పంటైన క్యారెట్ సాగుకు శ్రీకారం చుట్టి ప్రయోగాల బాట పట్టాడు.. తోటి రైతుల అవహేళనను అధిగమించి.. ప్రతికూల వాతావరణాన్ని సైతం అనుకూలంగా మలుచుకున్నాడు. అధికారుల సలహాల మేరకు డ్రిప్‌తో పంటపై గ్రిప్ సాధించాడు. ప్రయోగం ఫలించింది. ఇంకేముంది లాభాల వర్షం కురిసింది. జిల్లా వాతావరణానికి క్యారెట్ అనుకూలం కాకపోయినా సాహసంతో వినూత్న ప్రయోగం చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు ముద్దనూరుకు చెందిన రైతు కృష్ణయ్య.
కడప అగ్రికల్చరల్, న్యూస్‌లైన్: ముద్దనూరు మండలం ఆరవేటిపల్లెకు చెందిన రైతు మూరబోయిన కృష్ణయ్యకు వ్యవసాయం అంటే ప్రాణం. ఎక్కడైనా సరే ఆధునిక పద్ధతిలో పంటలు పం డిస్తున్నారని తెలిస్తే వెంటనే అక్కడ వాలిపోయి ఆ వివరాలను ఆయా రైతులను, ఉద్యాన, సూక్ష్మసాగు నీటి సేద్య అధికారులను అడిగి తెలుసుకుంటుంటారు. ఈ ప్రత్యేకతే ఆయన్ను వివిధ రకాల పంటలు సాగు చేసేందుకు ముందుకు నడిపిస్తోంది.
రెండెకరాల పొలంలో..
కృష్ణయ్య తనకున్న నీటి ఆధారిత రెండెకరాల పొలంలోని ఒక ఎకరంలో చీనీచెట్లు, మరో ఎకరంలో బొప్పా యి సాగు చేశారు. నిమ్మలో వంగ, బొప్పాయిలో క్యారట్‌ను అంతర పంటగా సాగు చేశారు. సాధారణంగా ఇక్కడి వాతావరణానికి క్యారెట్ పంట రావడం చాలా కష్టం. అయినా ప్రయోగాత్మకంగా ధైర్యంతో ఇరవై సెంట్లలో క్యారెట్ సాగు చే శారు.
సాగు ఇలా...
ముందుగా పొలాన్ని ఎలాంటి మట్టిగడ్డలు లేకుండా బాగా మెత్తగా చేశారు. ముద్దనూరు ఉద్యాన అధికారి ప్రసాదరెడ్డిని సంప్రదించి 300 గ్రాముల క్యారెట్ విత్తనాలను తెప్పించుకున్నారు. డీఏపీ 25 కిలోలు, వేపపిండి 25కిలో కలిపి పొలంలో చల్లారు. గతేడాది నవంబరులో బిందు సేద్యపైపుల వెంబడి క్యారెట్ విత్తనాలను నాటుకున్నారు. పొలంలో కలుపు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతూ కలుపును నివారించారు. పంటకు ఎలాంటి పురుగు మందులు వాడలేదు. ఉద్యాన అధికారి సలహాల మేరకు బిందు సేద్యంతో మొక్కలకు ఎప్పటికప్పుడు నీటి తడులు ఇస్తూ చల్లని వాతావరణాన్ని కల్పించాడు. దీనికంతటికి పెట్టుబడి రూ. 3500 అయింది. ఈ క్రమంలో పంట బాగా ఏపుగా పెరిగింది. ప్రతికూల వాతావరణంలోను ఒకటిన్నర టన్ను దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో కిలో రూ. 15 నుంచి 20ల ధరతో విక్రయించగా.. ఖర్చులన్నీ పోను 22 వేల నుంచి రూ. 25 వేల ఆదాయం వచ్చింది.
తోటి రైతులు ఎగతాళి చేశారు...
పంట సాగుకు ముందు తోటి రైతులు ఏవేవో పిచ్చిపిచ్చి పంటలు సాగు చేస్తుం టావన్నారు. నా ప్రయోగం ఫలించాక శభాష్ అంటున్నారు. చాలామంది రైతులు క్యారెట్ ఎలా సాగు చేయాలని అడుగుతున్నారు. బిందు సేద్యం కలిసి రావడంతో క్యారెట్ దిగుబడి తీయడ ం తేలికైంది. ప్రస్తుతం క్యాబేజి, క్యాలీఫ్లవర్, బఠానీలు,బంగాళదుంప,తెల్లగడ్డల సాగు చేపట్టాలనే ఆలోచనల్లో ఉన్నాను.
- మూరబోయిన కృష్ణయ్య, రైతు,ఆరవేటిపల్లె,ముద్దనూరు
కృష్ణయ్య కృషి పట్టుదలే కారణం...
బొప్పాయిలో క్యారెట్‌ను అంతర పంటగా సాగు చేసి మంచి దిగుబడి తీశాడు. వినూత్న ప్రక్రియలో జిల్లాలో ఈ పంటసాగు అంత అనుకూలం కాకపోయినృ కష్ణయ్య కషి, పట్టుదలను మెచ్చుకోక తప్పదు. ఇలాంటి ప్రయోగాలు చేసే వారు ముందుకు వస్తే ఎంతటి టెక్నాలజీనైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం.
-ప్రసాద రెడ్డి, ఉద్యాన అధికారి, ముద్దనూరు.
ప్రయోగం.. ఫలించింది
Published Wed, Jan 29 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement