సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న మెదక్ జిల్లాలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అనుమతి లేని క్వారీల ద్వారా ఎరర్రాళ్లు, ఎరమ్రట్టి, పలుగు రాళ్లు, కంకర తరలివెళ్తోంది. అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లు, ఇటుక బట్టీలు రెవెన్యూ, మైనింగ్, పోలీస్ యంత్రాంగానికి కాసుల వర్షం కురిపిస్తోంది. హైదరాబాద్ మెట్రో డెవలప్ అథారిటీ పరిధిలోని పది మండలాలతో పాటు, పొరుగునే ఉన్న మండలాల్లో సహజ వనరుల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లను గుర్తించి తొలగించే బాధ్యతను రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి సంయుక్తంగా అప్పగించారు. అక్రమ ఇసుక ఫిల్టర్లు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయాలనే నిబంధన ఉన్నా, చర్యలు తీసుకున్న దాఖలా కనిపించడం లేదు.
పటాన్‌చెరు, హత్నూర, తూప్రాన్ ప్రాంతాల్లో అక్రమ ఇసుక ఫిల్టర్ల ద్వారా రోజూ హైదరాబాద్‌కు వందలాది టన్నుల ఇసుక తరలివెళ్తోంది. జహీరాబాద్ ప్రాంతంలో విలువైన ఎరర్రాయి, ఎరమ్రట్టిని అక్రమార్కులు పొరుగునే ఉన్న కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జీఓఎంఎస్ 74 ప్రకారం జిల్లాలో ఖనిజాలు ఉన్న ప్రాంతాలను మైనింగ్ అధికారులు గుర్తించాల్సి ఉంటుంది. ఖనిజ సంపద, సహజ వనరులు తరలకుండా చూడాల్సిన బాధ్యత ఈ విభాగంపైనే ఉంది. ఎరమ్రట్టి, ఎరర్రాళ్లు వున్న ప్రాంతాన్ని మైనింగ్ ప్రాంతంగా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించినా ఆచరణకు నోచుకోవడం లేదు.
ఇటుక బట్టీలదీ ఇదే కథ
హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న మండలాల్లో ఇటుక బట్టీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అయితే ప్రభుత్వ ఖజానాకు మాత్రం రూపాయి ఆదాయం సమకూరడం లేదు. అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను పరిశ్రమలు, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సర్వే చేసి గుర్తించాల్సి ఉంటుంది. వీటిని రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సి ఉన్నా, స్పందన కనిపించడం లేదు. క్వారీ నిర్వాహకుల నుంచి సెస్ వసూలు కూడా శాస్త్రీయంగా జరగడం లేదు.
హెక్టార్‌కు రూ.10 వేల చొప్పున సెస్ వసూలు చేయాల్సిఉండగా, విస్తీర్ణం, సెస్ నిర్ణయంపై కాకి లెక్కలు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు క్రషర్ల నుంచి వచ్చే ఇసుకను నిర్మాణాలకు వాడేలా చూడాలని కలెక్టర్ దినకర్‌బాబు జిల్లా స్థాయి టాస్‌కఫోర్‌స(గనులు) కమిటీ సమావేశంలో సూచించారు. ప్రభుత్వ శాఖల ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేసి క్రషర్ల ద్వారా వచ్చే ఇసుక వాడకంపై ప్రచారం చేయాలనే ఆదేశాలు కూడా ఆచరణకు నోచుకోవడం లేదు.
యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ
Published Wed, Oct 9 2013 3:43 AM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM
Advertisement
Advertisement