అలల తీవ్రతకు కొట్టుకుపోతున్న రాజోలు దీవి సముద్ర తీరం
సాక్షి, కాకినాడ: అంఫన్ తుపాను హెచ్చరిక నేపథ్యంలో అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రా ల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి సోమ వారం రాత్రి తీర ప్రాంత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. తుని, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, కాకినాడలతో పాటు కోనసీమ ప్రాంతంలోని కాట్రేనికోన, అల్లవరం, అమలాపురం, మలికిపురం, రాజోలు, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అయినవిల్లి మండలాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ 24 గంటల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో తుపాను హెచ్చరికలపై ప్రచారం చేయాలన్నారు. అవసరమైతే పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటికే తమిళనాడు దక్షిణ కోస్తాతో పాటు నెల్లూరు లో వర్షాలు పడుతున్నాయన్నారు. ఇది ఉత్తర దిశగా కదులుతుందని, ఈ నెల 20, 22 తేదీల మ«ధ్య ఒడిశా, భువనేశ్వర్ తీరంవైపు కదులు తూ బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్టు తు పాను హెచ్చరిక కేంద్రం ప్రకటించడంతో అధికారు లు అప్రమత్తం కావాలన్నారు. జిల్లాలో బుధవారం ఈదురుగాలులతో వర్షం పడే అవకాశాలున్నట్టు తెలిపారు. సముద్రం తీరానికి పర్యాటకులను అనుమతించ వద్దని, ఎవరైనా వస్తే వారిపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. తుపాను సమయంలో వినియోగించే వివిధ పరికరాల పని తీరును పరిశీలించి తదనుగుణంగా వాటిని సిద్ధం చేసుకోవాలని మండల పరిధిలోని అధికారులను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు.
రాజోలు దీవిలో ‘అల’జడి 30 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం
మలికిపురం: అంఫన్ తుపాను ప్రభావం రాజోలు దీవి సముద్ర తీరంలో తీవ్రంగా ఉంది. తుపాను కారణంగా సముద్రపు అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. సుమారు 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. రాజోలు దీవిలో సముద్ర తీరం వెంబడి భారీగా అలలు భూభాగం వైపు చొచ్చుకుని వచ్చాయి. భూభాగం కూడా కొట్టుకుపోతోంది. మలికిపురం ఎస్సై ఎం.నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సముద్ర తీరం వద్ద బందోబస్తు నిర్వహించి ప్రజలు అటు వైపు రాకుండా అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment