వయసు 21.. ఏడాది వేతనం రూ. 2 కోట్లు
ఫేస్‌బుక్కులో ఉన్నత ఉద్యోగం
మదనపల్లె కుర్రోడికి ఉన్నత ఉద్యోగం
చిత్తూరు జిల్లా మదనపల్లె కుర్రోడికి బంపర్ ఆఫర్ వచ్చింది. 21 ఏళ్లకే సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కొట్టేశాడు మదనపల్లెకు చెందిన కే.వినిల్ ప్రతాప్. బోనస్ ఇతర అలవెన్సులతో కలిపి ఏడాదికి రూ.2 కోట్ల భారీ వేతనాన్ని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం నియామకపత్రం వచ్చింది.
తొలి నుంచి ప్రతిభావంతుడే..
వినిల్ ప్రతాప్ వయస్సు 21. తొలి నుంచి చదువులో ప్రతిభావంతుడు. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్, ముంబైలోని ఐఐటీలో బీటెక్ చదివాడు. ఆలిండియా స్థాయిలో ఐఐటీ ఎంట్రన్స్ టెస్టులో 67వ ర్యాంకు సాధించాడు. ఎంసెట్‌లో 82వ ర్యాంకు, జాతీయ స్థాయిలో ఏఐ ఈఈఈ ఎంట్రన్స్ టెస్టులో 87వ ర్యాంకు సాధించి ప్రతిభచాటాడు.
ఫేస్‌బుక్కుకు ఎంపికైంది ఇలా..
ప్రస్తుతం అతను కాలిఫోర్నియాలో ఫైనల్ ఇయర్ ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడ జరిగిన ఫెస్‌బుక్ క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇతని స్కిల్స్ నచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఎంపికయ్యాడు. బోనస్, ఇతర అలవెన్సులతో కలిపి ఏడాదికి రూ.2 కోట్ల (మూడు లక్షల 30 వేల డాలర్లు) వేతనంతో కూడిన ప్యాకేజీని ప్రకటించారు.
ప్లానింగ్‌తో సాధ్యం..
ఉన్నత ఉద్యోగాలు ఒక్కసారిగా రావు. ముందు నుంచి ప్లాన్‌గా సిద్ధపడాలి. కంపెనీల అవసరాలు, ఆలోచనా విధానం గమనించాలి. ఆపై విషయంపై పట్టు ఉండాలి. అప్పుడే మంచి ప్యాకేజీ గల ఉద్యోగాలు సాధ్యం. తన తండ్రి కే.శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతోనే తాను ఇంతటి స్థాయికి చేరుకున్నానని వినిల్ ప్రతాప్ తెలిపారు.
ఎస్‌వీటీఎం, విశ్వంలో సంబరాలు
మదనపల్లె సమీపంలోని అంగళ్లు మార్గంలో గల ఎస్‌వీటీఎం ఇంజనీరింగ్ కళాశాల, విశ్వం విద్యా సంస్థల్లో శనివారం సాయంత్రం కోలాహలం నెలకొంది. ఫేస్‌బుక్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగానికి ఎంపికైన వినిల్ ప్రతాప్ తండ్రి కె.శ్రీనివాసరెడ్డి ఈ విద్యా సంస్థలకు ైడె రెక్టరుగా ఉన్నారు. ఇక్కడ సహ అధ్యాపకులతో పాటు కరస్పాండెం ట్ విశ్వం ప్రభాకర్‌రెడ్డి, ఎం.అమరావతమ్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ వెంకట్రమణారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి, ఏవో శ్రీనివాసులరెడ్డి, క్యాంపస్ మేనేజర్ ముట్ర దామోదర్‌రెడ్డి ఆయన్ను అభినందించారు. విద్యార్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
సంతోషంగా ఉంది
ఫేస్‌బుక్‌లో మంచి వేతనంతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. మా స్వస్థలం నెల్లూరు. తండ్రి ఉద్యోగరీత్యా కొన్నేళ్లుగా మదనపల్లెలో స్థిరపడ్డాం. ఇంతకు ముందు కూడా ఇ-బే, గూగుల్‌లో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యా. అయితే ఫేస్‌బుక్ పనితనం నాకు నచ్చింది. వారికి నా పనితీరు నచ్చింది. అన్నీ కలిపి ఏడాదికి రూ.2 కోట్లు ప్యాకేజీ ఇస్తున్నామని జాయినింగ్ లెటర్ ఇచ్చారు. ఏప్రిల్‌లో యూఎస్‌లో డ్యూటీలో జాయిన్ అవుతా.
-కే.వినిల్ ప్రతాప్, మదనపల్లె