భయం.. భయం..! | Faction of the people of the village | Sakshi
Sakshi News home page

భయం.. భయం..!

Published Wed, Jan 20 2016 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

భయం.. భయం..!

భయం.. భయం..!

ఆ గ్రామ ప్రజలకు కక్షలు.. కార్పణ్యాలంటే తెలియదు. ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవనం సాగించేవారు. ఏమైందో తెలియదుకానీ చేతబడి అనుమానం ఊరిలో చిచ్చు రేపింది. క్షణికావేశంతో ఓ వృద్ధుడిని రాళ్లతో కొట్టి చంపేలా చేసింది. ఇంతలో మృతుడి ఆత్మ తిరుగుతోందనే పుకార్లు జనాన్ని మరింత వణికిస్తున్నాయి. దీంతో కొందరు గ్రామంలోని ఆలయాల్లోనే నిద్ర చేస్తున్నారు. మరికొందరు గ్రామం నుంచి వలస వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. నెల రోజుల వ్యవధిలో తీవ్ర అశాంతి.. అలజడి రేగిన ఊరే గురజాల మండలంలోని గోగులపాడు. ఈ ఊర్లో ఈ దుస్థితికి కారణం మూఢ నమ్మకాలే అని తెలుస్తోంది.

గుంటూరు :గురజాల మండలంలోని గోగులపాడు గ్రామంలో భయం రాజ్యమేలుతోంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కొందరు వ్యక్తులు చేతబడులు చేసి అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారనే వార్త గ్రామంలో దావానంలా వ్యాపించింది. దీనికి తోడు 20 రోజులుగా పది మంది మహిళల ఒంట్లోకి గ్రామ దేవతలు వచ్చి చేతబడి చేస్తున్న వారి అంతు చూడాలంటూ గ్రామస్తులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో 15 రోజులుగా 200 మంది గ్రామస్తులు పది బృందాలుగా ఏర్పడి రాత్రి సమయంలో గ్రామ పొలిమేరల్లో తిరుగుతూ చేతబడులు చేయకుండా కాపలా కాశారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ వెళ్లిన తరువాత శాంతి కోసం పూజలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇదిఇలా ఉండగా ఆదివారం గ్రామస్తులు ఊరి పొలిమేరల్లో తిరుగుతుండగా, క్షుద్ర పూజలు చేస్తూ ఇద్దరు కనిపించడంతో వారిని  చితకబాదారు. దీంతో తమతో పూజలు చేయిస్తోంది గురవారెడ్డి అంటూ వారు చెప్పడంతో గ్రామస్తులంతా గురువారెడ్డి ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి రాళ్ళతో పళ్లు ఊడగొట్టి తీవ్రంగా కొట్టారు.

ఇదే సమయంలో పూనకం వచ్చిన మహిళ అతన్ని హతమారిస్తేగాని ఊరికి మంచి జరగదని చెప్పడంతో విచక్షణ కోల్పోయిన గ్రామస్తులు గురువారెడ్డిని రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. దీంతో ఈ ఘటనకు కారణమైన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారెడ్డి మృతి చెందినప్పటికీ గ్రామ ప్రజల్లో మాత్రం భయం వీడలేదు. గురువారెడ్డి ఆత్మ గ్రామంలో తిరుగుతోందనే పుకార్లతో ప్రజలు చీకటి పడితే ఇళ్ల తలుపులు మూసుకుంటున్నారు. కొందరైతే దేవాలయాల్లో నిద్ర చేస్తూ పూజలు చేస్తున్నారు. మరికొందరు ఊరి నుంచి వలస వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement