‘ఫ్యాక్షన్’.. ప్లాన్.!
అమలాపురం టౌన్ : ఆ యువకుల వయస్సు పాతికేళ్ల లోపే. అయినా వారు ఫ్యాక్షన్ తరహాలో ప్రత్యుర్థులను హతమార్చేలా పథక రచన చేశారు. ప్రత్యర్థి కదలికలను సెలఫోన్‌ల ద్వారా తెలుసుకుంటూ మారణాయుధాలతో దాడి చేసేందుకు యత్నించారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థి కాస్త తెలివిగా తప్పించుకున్నాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అచ్చం ఫ్యాక్షన్ సినిమాలోని సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ సీన్ అమలాపురం సమీపంలో జరిగింది.
గత నెల 27వ తేదీ రాత్రి అమలాపురం సమీపం ఈదరపల్లిలో ఓ వర్గానికి చెందిన రౌడీషీటర్ కొలగాని స్వామినాయుడును హతమార్చేందుకు ప్రత్యర్థి రౌడీషీటర్ రవిరాజా పినిశెట్టి వర్గానికి చెందిన కొందరు యువకులు పథకాన్ని రూపొందించడం, అది విఫలం కావడం తెలిసిందే. ఆ హత్యాయత్నానికి పథక రచన చేసిన రౌడీషీటర్లు, నేరస్తులను శుక్రవారం పట్టణ సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై యాదగిరి, సిబ్బంది అరెస్టు చేశారు. మారణాయుధాలు, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం ఆ కేసు వివరాలను సీఐ విలేకర్లకు వెల్లడించారు.
హత్యకు ఇందుపల్లి వంతెన ఎంపిక
రౌడీషీటర్ స్వామినాయుడును అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి వంతెనపై హత్య చేసేందుకు ఆ రోజు రాత్రి రౌడీషీటర్ రవిరాజా పినిశెట్టి వర్గీయులు ఆరుగురు యువకులు సెల్‌ఫోన్ల సహకారంతో పథకాన్ని సిద్ధం చేశారు. ఈదరపల్లి పంచాయతీ వద్ద కిషోర్ తన సెల్‌ఫోన్‌లో నాయుడి కదలికలను ఎప్పటికప్పుడు ఇందుపల్లి వంతెన మీద కారులో మారణాయుధాలతో ఉన్న మిత్రులకు చేరవేసేవాడు. ఇది గమనించిన నాయుడు తన మిత్రుడి సహాయంతో కిషోర్ సెల్‌ను తీసుకోవడంతో పాటు అతడిని బంధించాడు. దీంతో నాయుడి హత్యా పథకం బయటపడింది. కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యా పథకం విఫలమైంది. ఇందుపల్లి వంతెనపై మాటు వేసిన రౌడీలు పరారయ్యారు. లేకుంటే నాయుడు ప్రత్యర్థుల చేతిలో హతమై ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు.
మారణాయుధాలతో పట్టుబడ్డ నిందితులు
అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుల్లో ఒకడైన కంచిపల్లి మణికంఠ కొంకాపల్లి రోడ్డు అబ్బిరెడ్డివీధిలో ఉండగా పట్టణ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం దాడి చేసి అరెస్ట్ చేశారు. వీరిలో అంబాజీపేటకు చెందిన బొక్కా ఉదయ్‌కుమార్, అమలాపురం ఏవీఆర్‌నగర్‌కు చెందిన పతివాడ నాగేంద్ర (రౌడీషీటర్), అబ్బిరెడ్డివీధికి చెందిన మండు అనిల్ అనే రెట్ట (రౌడీషీటర్), కంచిపట్ల మణికంఠ, అమలాపురం గనికమ్మ గుడి ప్రాంతానికి చెందిన మహ్మద్ నబీ అనే బబ్బులను అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. ఈ పథకానికి మూల కారకుడైన రవిరాజా పినిశెట్టిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే హత్య పథకం సమయంలో పట్టుబడ్డ కిషోర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థి కూడా...
హత్యా పథకంలో పాల్గొన్న ఏడుగురు యువకులు 25 ఏళ్ల లోపు వారే కాగా, వీరిలో ఉదయ్‌కుమార్ మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. హత్యాయత్నం కేసుతోపాటు పలు దొంగతనాలు, ఈవ్‌టీజింగ్ కేసులు ఇతడిపై ఉన్నాయి.
హత్యా పథకానికి ముందు వీరు అనకాపల్లి వెళ్లి మారణాయుధాలు కొనుగోలు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన ఎస్సై యాదగిరి, హెడ్‌కానిస్టేబుల్ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు బత్తుల రామచంద్రరావు, జి.కృష్ణసాయిలను డీఎస్పీ వీరారెడ్డి, సీఐ శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.