
అచ్చెన్న+ కూన
టీడీపీలో అధికార కేంద్రాల మధ్య వర్గపోరు
ఆరోగ్య మంత్రి ఎదుటే ఇరువురి సంవాదం
గతంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ భేటీలోనూ ఇదే సీన్
ఆమదాలవలసలో పెట్టాలని విప్ కూన రవి పట్టు
ఎచ్చెర్ల లేదా అంపోలు ప్రాంతాలను సూచిస్తున్న మంత్రి అచ్చెన్న
అంతా కలిసి నిర్ణయించండంటూ దాటవేసిన మంత్రి కామినేని
రిమ్స్ క్యాంపస్: రెండు అధికార కేంద్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి మంత్రిగా అచ్చెన్నాయుడుకు.. ప్రభుత్వ విప్‌గా కూన రవికుమార్ నియమితులయ్యారు. పోటాపోటీగా సమీక్షలు నిర్వహిస్తూ హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న వీరద్దరి మధ్య నర్సింగ్ కళాశాల అంశం వివాదం రాజేస్తోంది. తాము చెప్పిన చోటే కళాశాలను ఏర్పాటు చేయాలని ఎవరికి వారు పట్టుపడుతున్నారు. చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం రిమ్స్‌లో జరిపిన సమీక్ష సమావేశంలోనూ వీరి మధ్య నెలకొన్న వివాదంబయటపడింది. దీంతో ఇదే చర్చనీయాంశంగా మారింది.
కళాశాల మంజూరైనప్పటి నుంచీ..
శ్రీకాకుళంలోని రిమ్స్‌కు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజురైంది. తొలుత రిమ్స్ ఆవరణలోనే దీన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అం దుకు అవసరమైన ఐదు ఎకరాల స్ధలం రిమ్స్‌లో లేకపోవటంతో అధికారు లు స్థలాన్వేషణలో పడ్డారు. తాత్కాలికంగా రిమ్స్‌లోని స్టాఫ్ నర్సుల క్వార్టర్లను హాస్టల్‌గా మార్చి, వైద్య కళాశాలలోనే నర్సింగ్ కళాశాలను కూడా నడుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు ఎచ్చెర్లలోని కొండపై స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఆమదాలవలసలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెరపైకి తెచ్చారు. అక్కడితో ఆగకుండా ఆమదాలవలసలోనే నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామంటూ అక్కడ జరిగిన పలు సమావేశాల్లో ఆర్భాటంగా ప్రకటించేశారు కూడా.
ఇటీవల జరిగిన రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశంలో నూ ఈ విషయం ప్రస్తావించారు. ఎచ్చెర్లలో ఇప్పటికే యూనివర్సిటీ, గురుకులంతోపాటు ఎన్నో పరిశ్రమలు ఉన్నందున నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస, ఎచ్చెర్ల రెండూ సమాన దూరంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ సమావేశంలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందిస్తూ.. అక్కడెక్కడో ఆమదాలవలసలో ఎలా పెడతారని అంటూ.. ఎచ్చెర్లలోనే ఏర్పాటు చేస్తారని బదులిచ్చారు. ఎచ్చెర్లలోనే ఏర్పాటు చేయండంటూ అక్కడే కలెక్టర్‌కు సూచించారు. వీరిద్దరి సంవాదంతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ నివ్వెరపోయారు.
ఆరోగ్యశాఖ మంత్రి ముందూ అదే తీరు
అభివృద్ధి కమిటీ సమావేశంలో మొదలైన వివాదం తిరిగి మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముందుకొచ్చింది. రిమ్స్‌పై సమీక్షిస్తున్న సందర్భంగా నర్సింగ్ కళాశాలను త్వరగా ఏర్పాటు చేయాలని రిమ్స్ అధికారులు మంత్రిని కోరారు. వెంటనే కూన రవికుమార్ జోక్యం చేసుకొని ‘సార్ మంత్రిగారు.. నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయం డి’ అని కోరారు. ఆ వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు మైక్ ఆన్ చేసి ‘కళాశాల ఏర్పాటుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అంపోలు దారిలో స్థలం చూశారని.. దాన్ని ఆర్డీవో పరిశీలించారని అంటూ.. వీలైతే అక్కడ ఏర్పాటు చేయండి.. అది కాకపోతే ఎచ్చెర్లలో ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.
ఈ సందర్భంగా అచ్చెన్న, రవికుమార్‌లు తమ ప్రతిపాదనకు మద్దతుగా పోటాపోటీగా వాదించడం మొదలుపెట్టారు. వ్యవహారం ముదురుతున్నట్లు గమనించిన మంత్రి కామినేని అందరి ముందు చర్చించటం సరికాదని, వేరేగా కూర్చొని మాట్లాడుకుందామంటూ అడ్డుకట్ట వేశారు. మీరంతా నిర్ణయించుకుని ఎక్కడ పెట్టాలో చెబితే.. అక్కడే పెడదామంటూ ఆ అంశాన్ని దాటవేశారు. ఈ వాగ్వాదాన్ని చూసి జిల్లా కలెక్టరుతో సహా రిమ్స్ అధికారులు విస్మయానికి గురయ్యారు. జిల్లాకు ప్రయోజనకారి అయిన నర్సింగ్ కళాశాల ఏర్పాటు విషయంలో ఈ వర్గపోరేంటంటూ పలువురు ముక్కున వేలేసుకున్నారు.