ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చేసి గృహ నిర్మాణశాఖ అధికారులు రూ.2.29 కోట్లను సిమెంటు సరఫరా సంస్థలకు దోచిపెట్టడాన్ని కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక తప్పుపట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు పెన్షన్‌ల పంపిణీలో స్మార్ట్ కార్డు విధానం ఘోరంగా విఫలమైనా దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోయారని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ(డీఆర్‌డీఏ) అధికారులకు అక్షింతలు వేసింది. రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతిని కడిగేసింది. ఆ శాఖలో కొంద రు అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.5.31 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేల్చింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్ ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టింది. జిల్లాలో గృహనిర్మాణశాఖ, డీఆర్‌డీఏ, రెవెన్యూ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని, అలసత్వాన్ని కడిగిపారేసింది. జూన్ 2011 నుంచి జూలై 2011 మధ్య జిల్లాకు 1,79,197 బస్తాల సిమెంటు సరఫరా చేయకనే చేసినట్లు చూపి రూ.2.29 కోట్ల బిల్లులను ఆశాఖ అధికారులు కాంట్రాక్టర్‌కు చె ల్లించేశారు. ఉత్తినే దోచిపెట్టిన ఆ నిధులను వసూలు చే యాలని 2011-12 నివేదికలో గృహనిర్మాణశాఖ అధికారులను కాగ్ ఆదేశించింది. కానీ.. కాగ్ ఆదేశాలను అ ధికారులు బుట్టదాఖలు చేశారు. ఇదే అంశాన్ని 2012-13 నివేదికలోనూ కాగ్ ఎత్తిచూపింది.
డీఆర్‌డీఏ అధికారులపై అక్షింతలు..
జిల్లాలో 66 మండలాలకుగానూ 56 మండలాల్లోనూ ఎనిమిది నగర, పురపాలక సంస్థల్లోనూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా పెన్షన్‌ను స్మార్ట్‌కార్డుల ద్వారా జారీ చేసేందుకు డీఆర్‌డీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకు ఆరు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ.. స్మార్ట్ కార్డుల ద్వారా బ్యాంకులు పెన్షన్లను పంపిణీ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టలేని డీఆర్‌డీఏ అధికారులు.. చివరకు స్మార్ట్ కార్డుల ద్వారా పెన్షన్ల పంపిణీని ఆరు మండలాలకే పరిమితం చేశారు. కానీ.. ఇప్పటికీ సకాలంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయలేకపోతున్నారు. లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీలో కనిష్టంగా నాలుగు రోజులు.. గరిష్టంగా 34 రోజులు ఆలస్యమవుతోందంటూ డీఆర్‌డీఏ అధికారులకు కాగ్ అక్షింతలు వేసింది. రెవెన్యూశాఖ అధికారుల తీరునూ తూర్పారబట్టింది.
రెవె‘న్యూ’ మాయాజాలం..
చిత్తూరు, గుడిపాల మండలాల్లోని మాపాక్షి, 190 రామాపురం గ్రామాల్లో ఓ సంస్థకు వైద్య కళాశాల ఏర్పాటుకు 640.17 ఎకరాల భూమిని కేటాయిస్తూ మార్చి, 2010న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏ విద్యా సంస్థకైనా మార్కెట్ ధరకే భూములు కేటాయించాలని ప్రభుత్వం ఫిబ్రవరి 2005లో చేసిన నిబంధనకు నీళ్లొదిలారు. మార్కెట్ ధర ప్రకారం రూ.1.50 లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకూ పలుకుతోన్న భూమిని అప్పటి కలెక్టర్ రూ.లక్షకే కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రూ.లక్ష ప్రకారం తీసుకున్నా క్రమబద్ధీకరణ, స్టాంప్ డ్యూటీ కలుపుకుని ఆ వైద్య కళాశాల ప్రభుత్వానికి రూ.18.96 కోట్లు చెల్లించాలి. కానీ.. ఏప్రిల్, 2010న ఆ సంస్థ రూ.16.14 కోట్లే చెల్లించింది. తక్కిన రూ.2.82 కోట్లు చెల్లించలేదు.
ఆ సొమ్మును రాబట్టాల్సిన రెవెన్యూ అధికారులు మరో అడుగు ముందుకేసి.. ఆ భూమిలో వాగులు, వంకలు, పోరంబోకు భూమికి కూడా పరిహారం చెల్లించారనే సాకు చూపి ఆ సంస్థకు రూ.1.19 కోట్లను వాపసు ఇచ్చారని కాగ్ తేల్చింది. ఇందులో ఆంతర్యమేమిటని రెవెన్యూ అధికారులను నిలదీసింది. పూతలపట్టు మండలం ముత్తరేవులలో మరో విద్యా సంస్థకు భూకేటాయింపులపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ముత్తరేవులలో విద్యా సంస్థ ఏర్పాటుకు జూన్ 1999లో 17.84 ఎకరాల భూమి కేటాయించాలని ఓ సంస్థ దరఖాస్తు చేసుకుంది.
ఆ దరఖాస్తును పరిశీలించిన అప్పటి కలెక్టర్ 14.39 ఎకరాల భూమి ఆ సంస్థకు కేటాయిస్తే సరిపోతుందని తేల్చారు. కానీ.. ఆ నివేదికను పట్టించుకోని జిల్లా అధికారయంత్రాగం డిసెంబర్, 2009లో ఆ సంస్థకు 48.73 ఎకరాలను కేటాయించాలని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం 34.34 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించింది. ఎకరా రూ.నాలుగు లక్షల చొప్పున ఆ సంస్థ నుంచి వసూలు చేయాలని సూచించింది. కానీ.. భూమిని క్రమబద్ధీకరించడంలో రూ.57.56 లక్షలు ప్రభుత్వానికి నష్టం చేకూరేలా రెవెన్యూ అధికారులు చేశారని కాగ్ తప్పుబట్టింది.
అక్రమాల గుట్టు రట్టు
Published Wed, Sep 10 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement