సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో లిక్కర్ మాఫియా.. కల్తీ లిక్కర్ డాన్ ఎవరంటే.. అందరూ ఠక్కున చెప్పే పేరు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఏడు నెలల కిందటి వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ దన్నుతో వెలగపూడి ‘లిక్కర్’ అక్రమాల జోలికి వెళ్ళేందుకు సాహసించలేని ఎక్సైజ్ పోలీసులకు ఇప్పుడు పగ్గాలొచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా వెలగపూడి సిండికేట్‌లో మార్పు వస్తుందని అధికారులు ఆశించారు. అయితే సదరు మాఫియా గతంలో మాదిరిగానే అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో మెరుపు దాడులు చేశారు. మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ద్వారకా బస్టాండ్ ఎదుట ఉన్న దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ ఎవరిదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జీవీఎస్‌ఎన్ సత్యనారాయణ పేరిట ఉన్న ఈ బార్‌ను సతీష్ అనే టీడీపీ కార్యకర్త నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ వెలగపూడి బినావీులనేది లిక్కర్ సిండికేట్‌కే కాదు.. ఎక్సైజ్ అధికార వర్గాలందరికీ తెలిసిన వాస్తవం.
కల్తీ, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ ఈ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అయితే అధికారం దన్నుతో గత ఐదేళ్ళుగా ఎవ్వరూ దాడులు చేసే సాహసం చేయలేదు. గురువారం పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎక్సైజ్ ఈఎస్, టాస్క్‌ఫోర్స్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఓసీ బ్రాండ్ మద్యంలో క్రేజీ డాల్ అనే చీప్ లిక్కర్‌ను, ఎంసీ బ్రాందీలో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీని కలిపి కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే కల్తీ చేసిన 17 ఫుల్ బాటిళ్ళను సీజ్ చేశారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి.. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం కేసు మూలాల్లోకి వెళ్తారా.. లేదా కేవలం సిబ్బందికే పరిమితం చేస్తారా అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment