
విజయనగరం, మెంటాడ: మండలంలోని బడేవలస, పెదచామలాపల్లి గ్రామాల్లో సర్వే చేపడుతున్న యువకులను గురువారం పట్టుకుని ఆండ్ర పోలీసులకు అప్పగించిన విషయం మరువక ముందే శుక్రవారం జక్కువలో మరో బృందం సర్వే చేపట్టింది. దీంతో బృంద సభ్యులు ఎస్. దుర్గాప్రసాద్, ఎన్. భానుప్రకాష్‌లను పలువురు మహిళలు పట్టుకొని జక్కువ పీఏసీఎస్ అధ్యక్షుడు రెడ్డి అప్పారావు, లచ్చిరెడ్డి అప్పలనాయుడుకు అప్పగించారు. సర్వే బృందం పొంతన లేని సమాదానాలు చెప్పడంతో వారిని పోలీసులకు అప్పగించారు. జక్కువలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నందునే సర్వే పేరిట ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని పలువురు ఆరోపించారు. ఇటువంటి వారు సర్వేలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరుతున్నారు.
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
సాలూరు నియోజకవర్గంలోని కందులపథం.. మెంటాడ మండలంలోని బడేవలస, పెదచామలాపల్లి , జక్కువ గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో గుర్తింపు కార్డులుకూడా లేని వ్యక్తులు సర్వేలు చేపట్టారు. ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితాలు సరిచూసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా.– పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే