
యువకుడ్ని పోలీసులకు అప్పగించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
విజయనగరం, రామభద్రపురం: మండల కేంద్రంలోని కనిమెరకవీధిలో ట్యాబ్ సహాయంతో సర్వే చేపడుతున్న యువకుడు ఆదివారం మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. దీంతో స్థానికులు పట్టుకుని అతడ్ని పోలీసులకు అప్పగించారు. మండలంలో వారం రోజుల కిందట సర్వే పేరుతో ఇంటింటికీ యువకులు తిరుగుతూ సర్వే చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అనంతపురం జిల్లా కదిరి మండలానికి చెందిన దుంగవాత రవి ఆదివారం సర్వే చేపడుతూ కనిపించాడు. దీంతో స్థానికులు కలుగజేసుకుని సర్వే ఎవరు చేయమన్నారు.. ఎందుకు చేస్తున్నారు... ఓటర్ల వివరాలు ట్యాబ్‌లలో ఎం దుకు పొందుపరుస్తున్నావు..అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో యువకుడు జవాబు చెప్పలేకపోయాడు. దీంతో అతడ్ని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుల సహకారంతో పోలీసులకు అప్పగించారు. రెండు వారాల కిందట రామభద్రపురం వాసి కర్రి శ్రీనివాసరావు కూడా సర్వేకు వెళ్లి అవి దొంగ సర్వేలని తెలుసుకుని మిన్నకుండిపోయాడు.
ఓట్ల తొలగింపే లక్ష్యం..
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగించడమే లక్ష్యంగా సర్వేలు చేస్తున్నా రు. నాకు ఈ మర్మం తెలి యక రోజుకు రూ. 800 ఇస్తామంటే స్నేహితుల ప్రోద్భలంతో సర్వేకు వెళ్లాను. బొండపల్లి మండలం ఒంపిల్లి, దత్తి రాజేరు మండలం కోరపుకొత్తవలస గ్రామాల్లో సర్వే చేశాం. అయితే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించలేకపోవడంతో నాకు డబ్బులు ఇవ్వకుండానే పంపించేశారు.
– కర్రి శ్రీనివాసరావు, రామభద్రపురం