ఉచిత విద్యుత్‌కు మంగళమేనా?
వ్యవసాయ కనెక్షన్లకు ఆధార్ గండం
సేకరణలో అధికారులు -ఆందోళనలో అన్నదాతలు
నెల్లూరు (రవాణా): దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంగళం పాడే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులేస్తుంది. కొద్దిరోజుల క్రితం గ్యాస్ కనెక్షన్లు, మొన్న రేషన్‌కార్డులు, నిన్న పింఛన్లు, నేడు ఉచిత విద్యుత్.. ఇలా ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించే దిశగా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత నెల రోజులుగా వ్యవసాయ పంపుసెట్లకు ఆధార్ నంబర్లను విద్యుత్ అధికారులు సేకరిస్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదంతా ఉచిత విద్యుత్‌కు మంగళం పాడటానికేనా? అనే సందేహాన్ని అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతులందరూ తప్పని సరిగా ఆధార్ నంబర్‌ను అందజేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 90శాతంకుపైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,44,864 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మొత్తం 1,43,625 మంది రైతులు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధిపొందుతున్నారు. కేవలం 1,239 మంది రైతులు మాత్రమే వ్యవసాయానికి సంబంధించి బిల్లులు చెలిస్తున్నారు. అంటే దాదాపు 95శాతం పైగా రైతులకు ఉచిత విద్యుత్ అందుతోంది. అయితే కొద్దిరోజులుగా విద్యుత్ అధికారులు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలని రైతులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈనెలాఖరు చివరి గడువుగా పెట్టారు. దీంతో వ్యవసాయ కనెక్షన్‌ను ఎక్కడ తొలగిస్తారోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం పింఛన్లు, రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లు తదితర వాటిలో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి భారీస్థాయిలో లబ్ధిదారులను తొలగించారు. ఆ మాదిరిగానే ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు కూడా తొలగించనున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో అన్నదాతలు అయోమయపరిస్థితిలో ఉన్నారు.
రైతులపై అధిక భారం
ఆధార్ లింకేజీ పేరుతో రాష్ట్రప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేస్తే రైతులపై అధిక భారం పడుతుంది. ఇప్పటికే ఎరువులు, కూలీరేట్లు, పురుగుమందుల ధరలు పెరిగి వ్యవసాయం చేయాలా వద్దా? అనే సందేహంలో రైతులున్నారు. ఇప్పటికే అరకొర విద్యుత్ సరఫరాతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 7 గంటలని చెబుతున్నా.. అది 5 గంటలకు మించడంలేదు. జిల్లాలో 5 హార్స్‌పవర్, 7 హార్స్‌పవర్, 10 హార్స్‌పవర్ మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్‌ను రూ.3.75 లకు కొనుగోలు చేస్తోంది. ఉదాహరణకు 5 హార్స్‌పవర్ మోటారుకు గంటకు 3.8 యూనిట్లు ఖర్చవుతుంది. ఈలెక్కన 5 గంటలకు రోజుకు 19 యూనిట్లు ఖర్చవుతుంది. అంటే రోజుకు రూ.71.25 అవుతుంది. ఈలెక్కన నెలకు రూ.2,137 బిల్లు రైతులు విద్యుత్‌శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అదే 7 గంటలు విద్యుత్‌ను వినియోగిస్తే నెలకు రూ.2,993 బిల్లు వస్తుంది. అదే 7 హార్స్‌పవర్, 10 హార్స్‌పవర్ మోటార్లకు దాదాపు నెలకు రూ.5వేలు బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఈ రీతిలో నెలనెలా బిల్లు చెల్లించాల్సిన పరిస్థితే వస్తే వ్యవసాయం చేయడం కన్నా మానుకోవడం మేలన్న అభిప్రాయంలో రైతులు ఉన్నారు. ఇవేమి పట్టించుకోని విద్యుత్ అధికారులు మాత్రం ఆధార్ నంబర్‌ను సేకరించే ప్రయత్నాల్లో ముమ్మరంగా ఉన్నారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే,
ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే వ్యవసాయ పంపుసెట్లకు ఆధార్ నంబర్లును అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో సగానికిపైగానే కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేశాం. మిగిలినవి కూడా ఈనెలాఖరు లోపు పూర్తిచేస్తాం.
- వెంకటేశ్వరరావు, టెక్నికల్ డీఈ