
సాక్షి, అమరావతి: ఆంధప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన వేళ గురువారానికి ఓ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో భారీ మోజారిటీ కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఆంధప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన ‘ఏప్రిల్ 11’, ఫలితాలు వెలువడిన ‘మే 23’ రెండు తేదీలు గురువారం కావడం, అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నా మే 30 వ తేదీ కూడా గురువారం కావడంతో.. ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
దీని వెనుక ఎలాంటి సెంటిమెంట్ లేకపోయినప్పటికీ ప్రసుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్‌గా మారింది. యాదృచ్ఛికంగా చోటుచేసుకున్న దీనిపై వైఎస్ జగన్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా, తను నమ్మిన సిద్థాంతంకోసం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకుసాగిన రాజన్న తనయుడికి ప్రజలు ఈ ఎన్నికల్లో బ్రహ్మారథం పట్టారు. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి నేనున్నాంటూ భరోసానిస్తూ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర సాగించిన జననేతను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. చర్రితలో నిలిచిపోయేలా విజయాన్ని అందించారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అంటూ నిస్పష్టమైన తీర్పు ఇచ్చారు.