పశువులపాలు
చల్లపల్లి : ఈ ఖరీఫ్‌లో 6.38 లక్షల ఎకరాల్లో వరి సాగువుతుందని అధికారులు అంచనా వేశారు. అదే అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 2.20 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. అవి కూడా బోర్ల కింద, మురుగుబోదుల్లోని నీటితో సాగుచేసినవే. మరో 65 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 40 శాతమే వరిసాగు మొదలైంది. 60 శాతం పొలాలు బీళ్లను తలపిస్తున్నాయి. మరో 20 రోజుల వరకూ సాగునీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఈ సమయానికి 60 శాతం నాట్లు పడగా ఈ ఏడాది కనీసం 50 శాతం నాట్లు పడే పరిస్థితి కనబడటం లేదు.
పశువుల మేతగా నారుమళ్లు
జిల్లా వ్యాప్తంగా రైతులు 30 వేల ఎకరాల్లో నారుమళ్లు పోశారు. ఈ నారుమళ్లు సక్రమంగా పెరిగితే 3 లక్షల ఎకరాల్లో నాట్లు వేసేందుకు సరిపోతుంది. 18 నుంచి 25 రోజుల నారుతో నాట్లు వేయాలి. ఇప్పటికే కొన్నిచోట్ల నారుమళ్ల వయసు 30 రోజులు దాటింది. ఈ నారుతో నాట్లు వేసే పరిస్థితి లేదని రైతులు ఆందోళనచెందుతున్నారు. పంటకాలువలకు సాగునీరు రాకపోవడం, సరిగా వర్షాలు పడకపోవడంతో చాలాప్రాంతాల్లో నారుమళ్లు ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల ఎదుగుదల లేకుండా పోవడంతో నాట్లు వేసేందుకు పనికిరాక పశువులకు మేపేస్తున్నారు. మచిలీపట్నం మండలంలోని సుల్లానానగర్, అరిసేపల్లి భోగిరెడ్డిపల్లి ప్రాంతాల్లో చాలావరకు నారుమళ్లను పశువులకు మేపేశారు. పెడన, కృత్తివెన్ను మండలాల్లో నీరందక నారుమళ్లు ఎండిపోయాయి.
గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు, మొవ్వ మండలాల్లో బోర్లు కింద మినహా మిగిలిన ప్రాంతాల్లో నారుమళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ప్రాంతాల్లో ముందుగా పోసిన నారుమళ్లు ముదిరిపోవడంతో పశువులకు మేతగా వాడుతున్నారు. నారుమళ్లు పోసేందుకు ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.6వేల ఖర్చయిందని, సాగునీరు లేక నారును పశువులకు మేపాల్సి వస్తోందని చల్లపల్లి మండలంలోని పాతమాజేరు, కొత్తమాజేరు, మంగళాపురం, ఘంటసాల మండలంలోని లంకపల్లి, ఎండకుదురు గ్రామాల రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
అదును దాటుతోంది
ఏటా ఆగస్టు ఆఖరుకు 90 శాతం నాట్లు పూర్తవుతాయి. ఈ ఏడాది 50 శాతమైనా పూర్తయ్యేపరిస్థితి లేదు. ఈ నెలలో నాట్లు వేయకపోతే ఖరీఫ్ సాగు అదును దాటుతుందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్‌లో నాట్లు పడితే రెండో పంట సాగుచేసే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. ఇప్పట్లో సాగునీరు వచ్చే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు రైతులను మరింత కలవర పెడుతున్నాయి.
కడుపు తరుక్కుపోతోంది
సాగునీరు రాకపోవడం, వర్షాలు పడకపోవడంతో పొలాలను ఇంతవరకూ దుక్కి దున్నించలేదు. నారుమళ్లుపోసినా వర్షాలు లేకపోవడం వల్ల ఎదుగుదల లేక ఎండిపోతున్నాయి. బీడు భూములుగా మారిన పొలాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.
- బొప్పన వెంకట సుబ్బారావు, కొత్తపేట, అవనిగడ్డ మండలం
కరుణించని వరుణుడు
నా జీవితంలో ఇంతటి దారుణ పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. వానలు లేవు. కాలువులకు నీరు రాదు. నారుమళ్లు ఎండిపోతున్నాయి. కాలువులకు నీరు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. వరుణదేవుడు కరుణించడం లేదు. సాగు చేయాలో, వదులుకోవాలో అర్థం కావడం లేదు.
- మత్తి కుటుంబరావు, రామచంద్రపురం, అవనిగడ్డ మండలం