రైతు ఉసురు తీసిన అప్పులు.. | Farmer commits suicide over mounting debts in parigi | Sakshi
Sakshi News home page

రైతు ఉసురు తీసిన అప్పులు..

Published Mon, Jan 13 2014 12:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

Farmer commits suicide over mounting debts in parigi

పరిగి, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలు, అప్పుల బాధ నేపథ్యంలో మనస్తాపం చెందిన ఓ రైతన్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని కుటుంబీ కులు వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లాపూర్ గ్రామానికి చెందిన రైతు పరిగి జంగయ్య(50)కు స్థానికంగా ఐదెకరాల పొలం ఉంది. ఖరీఫ్‌లో ఆయన పత్తిపంట సాగుచేయగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం ఆయన రూ. 2 లక్షలు బ్యాంకులో, తెలిసిన వారి వద్ద మరికొంత అప్పు చేశాడు. ఇటీవల కుటుంబ కలహాలు అధికమయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన జంగయ్య శనివారం సాయంత్రం పొలంలో పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆయనను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రైతు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈమేరకు మృతుడి కొడుకు బాల్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి తెలిపారు.
 
 వైద్యులతో కుటుంబీకుల వాగ్వాదం..
 వైద్యుల నిర్లక్ష్యంతోనే జంగయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి విషమిస్తే ఉస్మానియాకు రిఫర్ చేయకుండా ఇక్కడే ఎందుకు చికిత్స అందించారని డ్యూటీ డాక్టర్ చంద్రశేఖర్‌తో పాటు ఎస్పీహెచ్‌ఓ(సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్) దశరథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులకు పీఏసీఎస్ డైరక్టర్ లాల్‌కృష్ణప్రసాద్ మద్దతు పలికారు. జంగయ్య మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement