దీనావస్థలో అన్నదాత కుటుంబం | Farmer Death Compensation Still Pending | Sakshi
Sakshi News home page

దీనావస్థలో అన్నదాత కుటుంబం

Published Mon, Mar 11 2019 11:53 AM | Last Updated on Mon, Mar 11 2019 11:53 AM

Farmer Death Compensation Still Pending - Sakshi

శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు

బుచ్చెయ్యపేట(చోడవరం): అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆ అన్నదాతకు పురుగుమందే దిక్కయింది. అవమానాలు, బాధలు భరించలేక... తనపై ఆధారపడిన కుటుంబానికి దిక్కులేకుండా చేసి బలవన్మరణం చెందాడు. ఆ  రైతు  కుటుంబానికి మంజూరైన పరిహారాన్ని అందించడానికి నాలుగు నెలలుగా మండల అధికారులకు తీరిక లేకుండా పోయింది. అప్పుల ఊబిలో కూరుకు పోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి మంజూరైన పరిహారాన్ని తక్షణం  అందించాల్సి న అధికారులు..   రైతు శ్రీనివాసరావు  భార్య కాంతంను  పదేపదే తిప్పుతున్నారు. వడ్డీ వ్యా పారుల వేధింపులతో భర్త పురుగు  మందు తాగి మృతి చెందగా, రోడ్డున పడిన కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చాలని అతని భార్య బుచ్చెయ్యపేట  కార్యాలయాలు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా ఆమె గోడు వినేవారు లేరు.

భర్తపోయి పుట్టెడు దుఖ:లో ఉండగా వడ్డీ వ్యాపారులు  ఇంటికొచ్చి బాకీ తీర్చమని ఒతిళ్లు చేస్తున్నారు. ఎనిమిదో  నెల గర్భిణి అయిన  కుమార్తె ఇంట్లో ఉంది. ఇంటర్‌ చదువుతున్న కొడుకు, వయస్సు మళ్లిన తల్లిదండ్రుల పోషణ భారాన్ని  కాంతం మోస్తోంది. మరో పక్క కాళ్లు అరిగేలా నాలుగు నెలలుగా బుచ్చెయ్యపేట ఓవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు అందుబాటులో లేక మంజూరైన పరిహారం చేతికి అందలేదని బాధితురాలు కన్నీరు పెట్టుకుంటోంది. అధికారుల తీరుపై రైతు సంఘ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2017లో బలవన్మరణం
బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన మరిసా శ్రీనివాసరావు (43)అప్పుల బాధతో 2017 సంవత్సరం ఏప్రిల్‌ 17న పురుగు  మందు తాగి మృతి చెందాడు. ఇతనికి ఉన్న ఎకరంన్నర పొలంతో పాటు బెల్లం క్రషర్‌ ఆడుతూ  జీవనం సాగించేవాడు. ప్రతి సంవత్సరం అప్పుల చేసి వ్యవసాయం చేస్తున్నా వాతావరణం అనుకూలించక, పంటలకు గిట్టుబాటు ధర లేక పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయాడు. కొంత పొలం అమ్మి, రూ.నాలుగు లక్షల వరకు  అప్పుచేసి  కుమార్తె పావనికి పెళ్లి చేసిన ఏడాదిలోనే ఇతని బెల్లం క్రషర్‌ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. పాలిచ్చే రూ.80 వేలు విలువ చేసే పాడి గేదె మృతి చెందింది.   మూడేళ్ల కాలంలో  అన్ని విధాలా నష్టాలు రావడంతో పాటు ఉన్న ఉపాధిని కోల్పోయాడు. అప్పుచ్చిన అనకాపల్లి బెల్లం వ్యాపారి శ్రీనివాసరావును అందరి ముందు  నిలదీయడంతో   అవమానంతో కుంగిపోయాడు. పది లక్షలు వరకు బయట,బ్యాంకులో అప్పులు చేశాడు. అయితే  అప్పులు తీర్చే అవకావం లేకపోవడం,అప్పులిచ్చిన వారి అవమానాలతో జీవితంపై విరక్తి చెంది తన పొలంలోనే పురుగు  మందు  బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్లో అధికారులు విచారణ జరిపి అప్పుల బాధతోనే మృతి చెందినట్టు నిర్ధారించారు.

పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించి తొందరలోనే  అందించి ఆదుకుంటామన్నారు. శ్రీనివాసరావు మృతి చెంది రెండేళ్లు అవుతున్నా పరిహారం అందకపోవడంతో మృతుడి  భార్య  కాంతం,కుమారుడు గణేష్‌  అప్పుఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నారు. కాంతం తల్లిదండ్రులు మడగల పార్వతి,గజ్జెంనాయుడులకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో వృద్ధాప్యంలో కాంతం మీదనే ఆధారపడ్డారు. కొడుకు ఇంటర్‌ చదువుతుండగా, కుమార్తె పావనిప్రసవం కోసం ఇంటికి వచ్చింది.  వీరి కుటుంబానికి ఐదు నెలల కిందట మూడున్నర లక్షల పరిహారం మంజూరవగా తహసీల్దార్, మృతుడు శ్రీనివాసరావు భార్య పేరు మీద బ్యాంకులో జాయింట్‌ అకౌంటులో నగదు ఉంచారు. ఈ నగదు తీసుకోడానికి  వ్యవశాయశాఖ అధికారిణి సాగు ఖర్చుల కింద నివేదిక అందించాల్సివుంది. నివేదిక కోసం శ్రీనివాసరావు భార్య నాలుగు నెలలుగా బుచ్చెయ్యపేట  వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కార్యాలయంలో ఏవో ఉండక నివేదిక ఇచ్చేవారు లేక నగదు చేతికి రావడం లేదు. ఈమె గోడు వినే నాథుడు లేక మంజూరైన పరిహారం అందక అప్పులవారి ఒత్తడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతోంది.  ఇప్పటికైనా జిల్లా అధికారులు  రైతు శ్రీనివాసరావు కుటుంబానికి మంజూరైన పిరిహారం అదేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement