అక్కడ పరిహారం.. ఇక్కడ పరిహాసం | farmers are tension on power grid corporation of india behaviour | Sakshi
Sakshi News home page

అక్కడ పరిహారం.. ఇక్కడ పరిహాసం

Published Thu, Nov 13 2014 2:09 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

అక్కడ పరిహారం.. ఇక్కడ పరిహాసం - Sakshi

అక్కడ పరిహారం.. ఇక్కడ పరిహాసం

రైతులపై తొలుత రౌడీయిజం చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఇప్పుడు పరిహారం పేరుతో పరిహసిస్తోంది. నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఒక్కో హైటెన్షన్ టవర్ నిర్మాణానికి రైతుకు రూ.3.50 లక్షల పరిహారం అందించిన పీసీఐ.. మన జిల్లాలో మాత్రం రూ.50 వేలకు మించి ఇచ్చేది లేదని మొండికేస్తోంది. పీసీఐ వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. గంగాధరనెల్లూరు మండలంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణాన్ని బుధవారం రైతులు అడ్డుకున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: పీసీఐ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ(ట్రాన్స్‌మిషన్ సిస్టమ్)ను ఏర్పాటుచేస్తోన్న విషయం విదితమే. ప్రస్తుతం తమిళనాడులోని తిరువల్లం నుంచి కర్నూలు వరకూ 765 కేవీ హెటైన్షన్ లైన్.. కృష్ణపట్నం నుంచి నెల్లూరు మీదుగా తిరుపతి వరకూ 400 కేవీ హైటెన్షన్ లైన్‌ను పీసీఐ నిర్మిస్తోంది. ఈ పనులను ప్రత్యేక అనుమతి ఉన్న కాంట్రాక్టర్లకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అప్పగించింది. తమిళనాడులోని తిరువల్లం నుంచి చిత్తూరు, కడప, కర్నూలు వరకూ 385 కి.మీల మేర 765 కేవీ హైటెన్షన్ లైను నిర్మించడానికి ఒక్క మన జిల్లాలోనే 11 వేల ఎకరాల భూమిని సేకరించాలి.

కృష్ణపట్నం నుంచి నెల్లూరు మీదుగా శ్రీకాళహస్తి వరకూ నిర్మించే 400 కేవీ లైను చిత్తూరు జిల్లాలో 65 కిమీల మేర నిర్మించడానికి 6,500 ఎకరాలు సేకరించాలి. కానీ.. పీసీఐ ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించకుండానే హైటెన్షన్ లైన్ల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ అన్యాయంపై నిలదీసిన రైతులను 1885 టెలీగ్రాఫిక్ చట్టాన్ని బూచిగా చూపి.. పోలీసులను ఉసిగొలిపి బెదిరిస్తూ రౌడీయిజానికి పాల్పడింది. కానీ.. నెల్లూరు, గుంటూరు జిల్లాలో 400 కేవీ విద్యుత్ హైటెన్షన్ లైన్ నిర్మించిన సమయంలో ఒక్కో టవర్ నిర్మాణానికి అవసరమైన భూమికి రూ.3.50 లక్షల చొప్పున (భూమికి రూ.2.60 లక్షలు, నష్టపోయిన పంటకు రూ.90 వేలు) పరిహారం అందించారు.

ఇదే అంశాన్ని అక్టోబర్ 20న ‘పరిహారం చెల్లించకనే విద్యుత్ లైన్ల నిర్మాణం’ కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది. రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మాంగాటి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో నిర్వాసితులైన రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని ఉద్యమించారు. వీటిపై స్పందించిన కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్  నిర్వాసితులైన రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ పీసీఐకి అక్టోబర్ 21న నోటీసులు జారీచేశారు.

ఉద్యమిస్తోన్న రైతులు..
కలెక్టర్ నియమించే కమిటీతో నిమత్తం లేకుండా పీసీఐ నిర్ణయించిన పరిహారంపై రైతులు మండిపడుతున్నారు. నెల్లూరు, గుంటూరు జిల్లాలో 400 కేవీ టవర్లకే ఒక్కోదానికి రూ.3.50 లక్షల వంతున పరిహారం అందించిన నేపథ్యంలో.. 765 కేవీ టవ ర్ల నిర్మాణానికి రూ.ఏడు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మామిడి, కొబ్బరి వంటి చెట్లకు మాత్రమే రూ.6,500 చొప్పున పీసీఐ పరిహారం చెల్లిస్తోంది.

ఆ పరిహారంపై కూడా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీసీఐ నిర్ణయించిన పరిహారం ఒక్క పంటకే ఒక్కో చెట్టు నుంచి వస్తుందని రైతులు చెబుతున్నారు. గుజరాత్‌లో కొబ్బరి, మామిడి వంటి వృక్షాలకు రూ.35 వేల చొప్పున పీసీఐ పరిహారం చెల్లించిందని గుర్తుచేస్తున్నారు. జిల్లాలో సైతం అదే తరహాలో పరిహారం చెల్లిస్తేనే విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అంగీకరిస్తామని స్పష్టీకరిస్తున్నారు.
 
కమిటీ వేయకుండానే..

2006లో సవరించిన టెలీగ్రాఫిక్ చట్టం ప్రకారం 400 కేవీ, 765 కేవీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో విద్యుత్ హైటెన్షన్ లైన్లు నిర్మించే సమయంలో.. ఆ టవర్ల నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతులను పీసీఐ సంప్రదించాలని నిబంధన విధించారు. ఆ చట్టం ప్రకారం పీసీఐ- రైతులకూ.. కలెక్టర్‌కూ నోటీసులు జారీచేయాలి.

ఆ నోటీసులు అందాక జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్.. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులతో ఓ కమిటీని వేయాలి. ఆ కమిటీ రైతులతో చర్చించి భూములకు, పంట లకూ పరిహారాన్ని నిర్ణయిస్తారు. ఆ మేరకు నిర్వాసితులకు, రైతులకు పరిహారం చెల్లించిన తర్వాతనే హైటెన్షన్ విద్యుత్ లైన్లను నిర్మించాలి. కానీ.. పీసీఐ నిబంధనలు అతిక్రమించడంతో అక్టోబర్ 21న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నోటీసులు జారీచేశారు.

పరిహారం నిర్ణయించి.. రైతులకు అందించే వరకూ పనులు ఆపేయాలని ఆదేశించా రు. కానీ కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ పీసీఐ రంగంలోకి దిగి టవ ర్ల నిర్మాణానికి పూనుకుంది. కలెక్టర్ కమిటీ వేయకుండానే ఒక్కో టవర్‌కు రూ.50 వేల వంతున పరిహారం చెల్లిస్తామని పీసీఐ ప్రతిపాదిస్తున్నా రెవెన్యూ వర్గాలు అభ్యంతరం చెప్పకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement