కౌలురైతుకుదేలు | Farmers lease silent | Sakshi
Sakshi News home page

కౌలురైతుకుదేలు

Published Thu, Jun 5 2014 1:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

కౌలురైతుకుదేలు - Sakshi

కౌలురైతుకుదేలు

  •      ఖరీఫ్ ముంచుకొస్తున్నా కౌలు రైతుల గుర్తింపు లేదు
  •      రుణ అర్హత కార్డుల జారీ నిల్
  •      అప్పులివ్వని బ్యాంకర్లు
  •      పంట రుణ లక్ష్యంలో కానరాని ప్రస్తావన
  •  కౌలు రైతులు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో విలవిల్లాడుతున్నారు. మూడేళ్లుగా చవిచూసిన నష్టాలను దిగమింగుతూ మళ్లీ సాగుకు సిద్ధమవుతున్న వీరిని పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఖరీఫ్ తరముకొస్తున్నా..వీరి గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. రుణ అర్హత కార్డులు ఎప్పుడిస్తారో ఎవరికీ స్పష్టత లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ సీజన్‌లో కూడా కౌలు రైతులకు మొండి చెయ్యేలా ఉంది. బ్యాంకుల నుంచి ఒక్క రూపాయి కూడా పంట రుణంగా వచ్చే అవకాశం కనిపించడం లేదు.
     
    విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో సుమారు 5 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 70 వేల మంది కౌలు రైతులుగా అంచనా.   గత ఖరీఫ్‌లో కేవలం 5336 మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు ఇవ్వాలని లక్ష్యాంగా పెట్టుకుని 3,341 మందికి మాత్రమే కార్డులు అందజేశారు. కార్డులున్న అందరికీ రుణాలివ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలు మాత్రమే ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి.

    ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సీజన్‌కు ముందే ఏప్రిల్, మే నెలల్లో రెవెన్యూ అధికారులు కౌలు రైతులను గుర్తించాలి . ఎన్నికలు కారణంగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియవైపు దృష్టిసారించలేదు. కొత్త వారి ఎంపిక మాటెలా ఉన్నా పాత వారి కార్డుల రెన్యువల్ గురించి కూడా పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఒకవేళ రుణ అర్హతకార్డులు ఇచ్చినా కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపించడం లేదు. కొందరు కార్డులు తీసుకోక ముందే భూయజమానులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు.

    కొత్త కార్డుల జారీలో రెవెన్యూ సిబ్బంది శల్యసారథ్యం, వ్యవసాయశాఖ సహకారం లేకపోవడం తదితర కారణాలనూ ఇక్కడ ఉదహరించవచ్చు. మూడేళ్లుగా ఇదే దుస్థితి. మంగళవారం జిల్లా రుణప్రణాళికను ఆమోదించిన అధికారులు కౌలు రైతులకు ఎంత మందికి ఎంతమేర రుణమిస్తారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే ఈ ఖరీఫ్‌లో వీరికి రుణాలు ఉండవా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    బ్యాంకుల కొర్రీలను తట్టుకోలేక అన్నదాతలు ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దిగుబడులు ఆశించిన మేర రాకపోవడం, మదుపులు పెరగడం, ప్రకృతి వైపరిత్యాలతో ప్రతీ ఏటా వీరు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ విషయంపై దృష్టిసారించకపోతే కౌలు రైతులకు ఈ ఖరీఫ్ మరింత భారం అవుతుంది.
     
    ఎప్పుడూ అన్యాయమే

    ప్రభుత్వ పరంగా రాయితీలు కౌలు రైతులకు దక్కడం లేదు. సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు అందకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో వీటిని అధిక ధరలకు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి. ఈ క్రమంలో నకిలీ, నాసిరకం విత్తనాలు కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారు. విపత్తుల సమయంలో పంటనష్టం పరిహారానికి నోచుకోవడం లేదు. దీనిని పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా చెల్లిస్తుండడంతో కౌలు రైతులు దూరమవుతున్నారు.
     
    ఏటా ఇబ్బందులే...
     
    నాది మునగపాక. రెండెకరాలు కౌలుకు తీసుకుని చెరకు పండిస్తున్నాను. రోజుల తరబడి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి పోరాడితేనే రుణ అర్హత కార్డును ఇచ్చారు. దాని ఆధారంగా ఏడాదికి రూ.35వేలు రుణమివ్వాలి. బ్యాంకువారు కేవలం రూ.17వేలు ఇచ్చారు. మదుపులు పెరగడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద మరి కొంత తెచ్చాను. వారికి వడ్డీలకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది.  ఏటా ఇదే పరిస్థితి.    
    - పెంటకోట సూరిబాబు, కౌలు రైతు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement