
రైతు దీక్షకు సంఘీభావం
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు జిల్లా బాసటగా నిలిచింది.
భారీగా తణుకు తరలివెళ్లిన జిల్లా నేతలు, అభిమానులు
విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు జిల్లా బాసటగా నిలిచింది. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ హామీ అమలులో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఆయన చేపట్టిన దీక్షకు జిల్లా సానుకూలంగా స్పందిం చింది. తణుకులో వై.ఎస్.జగన్ శనివారం చేపట్టిన రెండురోజుల దీక్షకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా జిల్లా నుంచే జగన్ సమరశంఖం పూరించిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ఆ పోరాటపంథానే కొనసాగిస్తూ ఆయన తణుకులో రెండురోజుల దీక్షను చేపట్టా రు. ఈ దీక్షకు కూడా జిల్లా నుంచి భారీ స్పందన లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కదలివెళ్లిన జిల్లా: వై.ఎస్.జగన్ తణుకులో చేపట్టిన దీక్షకు జిల్లా వెన్నంటి నిలిచింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తణుకుకు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి నుంచి రైళ్లు, బస్సులతోపాటు ప్రత్యేక వాహనాల్లో భారీ సంఖ్యలో తణుకు పయనమయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు తమ కార్యకర్తలతో కలసి దీక్షా ప్రాంగణానికి శనివారం ఉదయమే చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, కర్రి సీతారాం, తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమశంకర్ గణేష్, ప్రగడ నాగేశ్వరరావు తమ కార్యకర్తలతో కలసి హాజరయ్యారు. పార్టీ నేతలు బొడ్డేటి ప్రసాద్, కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, కంపా హనోక్, శ్రీకాంత్‌రాజు, పక్కి దివాకర్, రవిరెడ్డి తదితరులతోపాటు జిల్లాలోని పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల పార్టీ కన్వీనర్లు, పట్టణ పార్టీ కన్వీనర్లు తణుకు తరలివెళ్లారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ దీక్ష సభలో ప్రసంగించి ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. జిల్లా నుంచి వెళ్లిన ముఖ్య నేతలు అందరూ దీక్ష చేస్తున్న అధినేత వై.ఎస్.జగన్‌ను కలసి మాట్లాడారు. అందర్నీ ఆయన పేరుపేరున పలకరించారు. జిల్లా నుంచి ఇంకా పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో శనివారం రాత్రి తణుకు బయలుదేరి వెళుతున్నారు.