సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అంచనాలకు మించి వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. విత్తనాలు, ఎరువుల కోసం రైతాంగం నుంచి తీవ్ర డిమాండు నెలకొంది. మరోవైపు రుణాల కోసం రైతన్నలు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.764.40 కోట్లు పంట రుణం ఇవ్వాల్సి ఉంది. కాని నేటికీ 30 శాతం దాటలేదు.
ఖరీఫ్-2013 సీజన్‌లో 4.25 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే వర్షపాతం సాధారణ స్థాయిని మించడంతో సాగు విస్తీర్ణం ఐదు లక్షల హెక్టార్లకుపైగా నమోదైంది. జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి 2013-14లో రూ.1143 కోట్లు పంట రుణాలుగా అందజేయాల్సి ఉంది. ఇందులో కేవలం ఖరీఫ్‌లోనే రూ.764.40 కోట్లుగా రుణ వితరణ లక్ష్యం విధించారు. ఇటీవలి వర్షాలకు వరినాట్లు చురుగ్గా సాగుతుండటంతో రైతుల నుంచి పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా లీడ్ బ్యాంకు కార్యాలయం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 11,034 మంది రైతులకు రూ.230 కోట్లు పంట రుణంగా మంజూరు చేశారు. వీరిలో 3,169 మంది రైతులకు రూ.11 కోట్ల మేర రుణాలు రీ షెడ్యూలు చేసినట్లు బ్యాంకర్లు చెప్తున్నారు. పంట రుణాల వితరణలో అధికారులు చెప్తున్న లెక్కలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘బుక్ అడ్జస్ట్‌మెంట్’ పేరిట గతంలో పంట రుణాలు ఇచ్చిన వారి నుంచి సంతకాలు తీసుకుని కొత్తగా రుణాలు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు లెక్కలు చూపుతున్నారు. వాస్తవంలో రైతులకు నయా పైసా చేతికి అందకపోవడంతో విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి కోసం తిరిగి ప్రైవేటు రైతులను ఆశ్రయించాల్సి వస్తోంది.
కౌలు రైతులకు మొండిచేయి
కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలోనూ బ్యాంకర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కౌలు రైతులు 1,967 మంది వున్నట్లు వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా గుర్తించి రుణ అర్హత కార్డులు మంజూరు చేశాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో కేవలం 42 మందికి మాత్రమే రుణాలు అందజేశారు. దీర్ఘకాలిక, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయడంలోనూ బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు. మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ సంయుక్త సమావేశాల్లో రుణ వితరణ పురోగతిపై సమీక్ష జరుపుతున్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య వెల్లడించారు.
పంట రుణాలేవీ?
Published Wed, Aug 28 2013 1:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement