చల్లచల్లగా.. వెనిలా.. బటర్‌స్కాచ్.. హనీమూన్.. స్ట్రాబెర్రీ.. చాక్లెట్.. రంగురంగుల్లో నోరూరించే ఐస్ ఫ్లేవర్లు.. ప్రతి ఒక్కరినీ ఐస్‌క్రీం పార్లర్లకు నడిపిస్తున్నాయి.. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఐస్‌క్రీమ్‌లు ఆరగించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఈ ఐస్‌క్రీమ్‌లలో ఉన్న కొవ్వు పదార్థాలు, కెమికల్స్‌తో కూడిన రంగులు అనారోగ్యం పాలు చేస్తాయిని హెచ్చరిస్తున్నారు.
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు నగరంలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ఐస్‌క్రీమ్ పార్లర్లపై మెరుపుదాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఐస్‌క్రీంలు, ఎక్కువగా కొవ్వు ఉన్న పదార్థాలు, కెమికల్స్‌తో కూడిన రంగులు, పలు డబ్బాలపై తయారు చేసిన తేదీలు లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే పార్లర్లలో అపరిశుభ్రంగా ఉండటాన్ని కూడా కనుగొన్నారు.
నిబంధనలు ఇలా..
ఐస్‌క్రీమ్ తయారీ విషయాల్లో కొన్ని ప్రమాణాలు, నిబంధనలను ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా చెబుతుంది. ఆహార భద్రత చట్టం 2011 అనుసరించి ప్యాకింగ్ లేబుల్, ఏమి వాడుతున్నారో ఉండాలి. ఐస్‌క్రీమ్‌లలో ఎంత మేర పాలు, రంగులు, దాని అనుబంధ ఉత్పత్తులను, ఏయే ఫ్లేవర్‌లను కలుపుతారు అనేవిధంగా నిబంధనలు పాటించి, వాటిని పరీక్షించి ఆరోగ్యానికి హానికరంగా లేని విధంగా చూడాలి. కొన్ని ఐస్‌క్రీమ్‌ల్లో టాట్రాజిన్, కార్మోసిన్, రుడమిన్, సన్‌సెట్ ఎల్లో వంటి వాడకంలో పరిమితికి మించి వాడరాదు. టేస్ట్‌కోసం ఈ వాడకం ఎక్కువగా ఉంటే అనారోగ్యానికి హానికరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా పాలలోని కొవ్వు 2.5 శాతం కంటే మించకూడదు, ఘనపదార్థాలు 26 శాతం కంటే తగ్గకూడదు. చక్కెర 10 శాతానికి మించికూడదు.
కొవ్వుశాతంలో తేడా
నిబంధనలకు సంబంధించి కొన్పి పార్లర్లలో పరిశీలిస్తే పాలలోని ప్రొటీన్‌లు కొవ్వుశాతంలో తేడా ఉన్నట్లు తెలుస్తోంది. కొవ్వుశాతం 2.5 శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతున్నా ఏకంగా తొమ్మిది శాతానికి ఉందని తెలుస్తోంది. అదేవిధంగా వాటిలో వాడే కార్మోసిన్ అనే రంగుతో పాటు మరి కొన్ని రంగులు 152 పీపీఎంగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం 100 పీపీఎం మించకూడదని తెలుస్తోంది.
ప్యాక్‌లపై అంతా మాయ
ప్రధానంగా ఐస్‌క్రీమ్‌ల్లో కొవ్వు శాతాన్ని బట్టి మూడురకాలుగా విభజిస్తారు. సాధారణ వాటిల్లో ఎటువంటి కొవ్వును కలపరు. అదేవిధంగా ఇంకో రకం వాటిల్లో ఒక మాదిరిగా కలుపుతారు, మూడో రకంలో ఏ విధంగా ఉందో ప్యాక్‌పై పేర్కొనాలి. ఈ విధంగా మూడురకాలుగా వివిధ ఐస్‌క్రీమ్‌లు ఉంటాయి. వీటిని ప్యాక్ చేసే ముందు వాటిలో ఏయే పదార్థాలు కలిపారు. ఎప్పుడు తయారు చేశారు. అనే విషయాలు తెలియజేసే విధంగా ప్యాకింగ్ ఉండాలని అధికారులు చెబుతున్నారు. అయితే అందంగా ప్యాకింగ్ చేసినా లోపల ఉన్న దాంట్లో ఏయే పదార్థాలు వాడారో తెలియనీయకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఎక్కువ కాలం ఉండేందుకు వాటిలో కొన్ని రకాల రసాయనాలను కూడా కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
వందల కేజీల రంగుల వాడకం
జిల్లాలో సుమారుగా వెయ్యికి పైగా చిన్న, పెద్ద ఐస్‌క్రీమ్ షాపులున్నాయి. ఇవి కాకుండా కొన్ని కంపెనీలు ఐస్‌క్రీమ్‌లు ఉన్నాయి. నిత్యం జిల్లా వ్యాప్తంగా అన్నీ కలసి రోజుకు 10 వేల కిలోలకు పైగా ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు జరుగుతుంటాయని అధికారులు అంచనా వేశారు. దీంతో వాడే కొవ్వుపదార్థాలు, రంగులు వాడకం వందల కిలోల వరకు వాడుతున్నారని అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చారు. దీంతో రంగులు, కొవ్వుపదార్థాల వాడకంతో ఆరోగ్యంపై ప్రమాదం చూపే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. వీటితోపాటు అపరిశుభ్రంగా తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు తిన్నా వాటి వల్ల కూడా అనారోగ్యం వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment