టీడీపీలో ఎమ్మెల్సీ కాక
{పయత్నాలకు తెరతీసిన ఆశావాహులు
తమవర్గీయుడికోసం అయ్యన్న, గంటా వ్యూహాలు
అధిష్టానం కటాక్షం పైనే తటస్థుల ఆశలు
ఆసక్తికరంగా టీడీపీ వర్గ రాజకీయాలు
విశాఖపట్నం: అగ్నికి ఆజ్యం తోడవటమంటే ఇదేనేమో!... మంత్రులు అయ్యన్న, గంటా వర్గాల మ ద్య భగ్గుమంటున్న విభేదాలను మరింత రాజేసేలా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంలో టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందనీ... అదీ జిల్లా నేతకే అవకాశాలు ఎక్కువని అంచనా వేస్తున్నారు. దాంతో తమ వర్గీయుడికే ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేయడానికి ఇరువురు మంత్రులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చెరో జాబితా సిద్దం చేస్తున్నారు. మరోవైపు తటస్థ ముద్రతో ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోవాలని మరికొందరు నేతలు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆశల పల్లకీలో : జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ పీఠంపై కన్నేసిన ఆశావాహుల జాబితా చాంతాడును తలపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టిక్కెట్లు దక్కని నేతలు అందరూ ఎమ్మెల్సీ స్థానానికి గురిపెట్టారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ. రహమాన్, మాజీ మంత్రి మణికుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, తోట నగేష్, నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు తదితరులు రేసులో ఉన్నట్లు బయటపడ్డారు. వీరిలో కొందరు గంటా మద్దతు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరు అయ్యన్న ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు ఈ గ్రూపులతో సంబంధం లేకుండా నేరుగా సీఎం చంద్రబాబు కటాక్షం కోసం పావులు కదుపుతున్నారు.
దూకుడు మీదున్న అయ్యన్నవర్గం
- ప్రతిపాదించేది ఎవరి పేరో!
ఎమ్మెల్సీ పదవి తమ వర్గీయుడికే దక్కేలా చేయాలని మంత్రి అయ్యన్న వర్గం గట్టి పట్టుదలగా ఉంది. గంటా వర్గంతో కొనసాగుతున్న ఆధిపత్య పోరులో పెచైయ్యి సాధించడానికి ఇదే మార్గమని నమ్ముతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు ముందు పెట్టి గంటా వర్గాన్ని ఢీకొంటోంది అందుకేనని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తననే ప్రతిపాదిస్తారని ఆయన కూడా అయ్యన్నపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ అయ్యన్న లోతుగుండె రాజకీయాలు తెలిసినవారు మాత్రం ఆయన వ్యూహాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. విభేదాలకు కేంద్ర బిందువైన గవిరెడ్డికి అవకాశాలు సన్నగిల్లితే ప్రత్యమ్నాయంగా తమ వర్గం నుంచే మరొకరికి ప్రతిపాదించొచ్చు కూడా. ఎన్నికల ముందు అయ్యన్న టీడీపీలోకి తీసుకువచ్చిన తోట నగేష్ పేరు వినిపిస్తోంది. ఇక ‘కొత్త ముఖాన్ని’ తెరపైకి తెచ్చేందుకు కూడా అయ్యన్న యోచిస్తున్నారన్న సమాచారం టీడీపీలో కాక పుట్టిస్తోంది.
తటస్థుల జోరు : ఇరువర్గాలతో నిమిత్తం లేకుండా ప్రయత్నామలు ముమ్మరం చేస్తేనే ఫలితం ఉంటుందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, ఎస్.ఎ. రహమాన్, మణికుమారి తదితరులు ఉన్నారు. సీనియార్టీతోపాటు సామాజికవర్గ ప్రాతిపదికన పప్పల చలపతిరావు ఎమ్మెల్సీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.
ప్రధానంగా స్థానిక కాపు సామాజికవర్గానికి చెందిన వారికి జిల్లాలో అవకాశం దక్కలేదన్న వాదనను ఆయన తెరపైకి తెస్తున్నారు. మైనార్టీ కోటాలో ఎస్.ఎ.రహమాన్ ఎమ్మెల్సీ పీఠానికి గురిపెట్టారు. ఎస్టీ కోటాలో మణికుమారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితోపాటు నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు వంటి నేతలు కూడా తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అనూహ్యంగా కొత్త ముఖాలకు సీఎం చంద్రబాబు మొగ్గుచూపినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది టీడీపీ వర్గాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం ఎమ్మెల్సీ పదవే లక్ష్యంగా టీడీపీ రాజకీయాలు ఊపందుకోనున్నాయి.
గుంభనంగా గంటా వర్గం
ఎమ్మెల్సీ పదవి విషయంలో మంత్రి గంటా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాము నేరుగా ఎవరి పేరును ప్రతిపాదించకుండా అయ్య న్న వర్గం సూచించే నేతను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరి క్షణంలో తమవర్గీయుడి పేరును తెరపైకి తేవాలని భావిస్తున్నారు. అందుకోసం యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేసిన తనకు అవకాశం ఇవ్వాలని ఆయన పట్టుబట్టే అవకాశాలున్నాయి.