
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గొంతెత్తాలి: జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గొంతెత్తాలని, కలసిరావాలని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలను కోరినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
చెన్నై: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గొంతెత్తాలని, కలసిరావాలని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలను కోరినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా జగన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు జగన్ జయలలిత, కరుణానిధిలను కలిసిన తరువాత విలేకరులతో మాట్లాడరారు. తమ విజ్ఞపనలు వారు సావదానంగా విన్నట్లు తెలిపారు. కరుణానిధితో 45 నిమిషాలు మాట్లాడినట్లు చెప్పారు. ఇది చాలా ప్రధాన్యత గల అంశంగా వారు ఇద్దరూ భావించినట్లు తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాల్సిన అవసరాన్ని వారిద్దరి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే వారికి స్సష్టతలేదని, వారు ఏం చేస్తున్నారో వారికే తెలియడంలేదని చెప్పారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా రాష్ట్రాన్ని విభజిస్తారని హెచ్చరించారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించిన అంశంకాదని, ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యకు పాల్పడుతుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ను విభజిస్తున్నప్పుడు మౌనంగా ఉంటే, శాసనసభ తీర్మానం లేకుండానే విభజించిన తొలి రాష్ట్రం ఇదే అవుతుందని చెప్పారు. రెండు జిల్లాలనే ఎందుకు అన్ని జిల్లాలను కలిపి రాష్ట్రం పేరును తెలంగాణగా మార్చండని అన్నారు.
ముందు ఎన్నికలు జరపాలని కాంగ్రెస్కు జగన్ సవాల్ విసిరారు. తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని తెలిపారు. అదే నినాదంతో తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. 2014 ఎన్నికలనే రిఫరెండంగా తీసుకోండన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన వాదాన్ని బలపరుస్తారన్న విశ్వాసం ఉందని చెప్పారు. 30కి పైగా ఎంపి స్థానాలు గెలుస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మీపై మీకు నమ్మకం ఉంటే ఎన్నికలు నిర్వహించండని జగన్ సవాల్ విసిరారు. ప్రజల కోరిక మేరకు అప్పుడు నిర్ణయాలు చేయవచ్చన్నారు.