
Secretariat
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన జరగదంటూ ఒకవైపు మభ్యపెడుతుండగా మరోవైపు ఆయన నాయకత్వంలోని అధికార యంత్రాంగం విభజన పంపిణీ పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం ఆదేశాలు జారీ చేయడంతో గురువారం ఆర్థిక శాఖ నుంచి పలు శాఖల అధికార యంత్రాంగం రాష్ట్ర పునర్విభజన బిల్లులో పేర్కొన్న 13 షెడ్యూల్స్‌లోని అంశాల ప్రకారం ఎవరికెంతో తేల్చే పని మొదలుపెట్టింది.
ఇందుకు సంబంధించి ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.పి.టక్కర్ గురువారం ఆర్థికశాఖ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. బిల్లులో పేర్కొన్న షెడ్యూల్స్‌లోని అంశా ల మేరకు మొత్తం ఆస్తులెన్ని, అప్పులెన్ని లెక్కకట్టడంతో పాటు జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు ఏ రాష్ట్రానికెంతో తేల్చాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను టక్కర్ ఆదేశించారు. అలాగే బిల్లులోని 13వ షెడ్యూల్ పొందుపరిచిన 41 సంస్థలకు ఫండ్స్ ఎన్ని ఉన్నాయో లెక్కకట్టడంతో పాటు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తే ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయో తేల్చాలని టక్కర్ సూచించారు. ఇప్పుడే విభజన పంపిణీలకు సంబంధించి ప్రాథమికంగా సిద్ధం కాకపోతే రాష్ట్రం విడిపోయిన తరువాత వాటి లెక్కలు చూడటం కష్టమవుతుందని, అందువల్ల ఇప్పుడే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అలాగే తొమ్మిదవ షెడ్యూల్‌లో పేర్కొన్న 44 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి పంపిణీ ఏ విధంగా చేయాలో నోట్‌ను తయారు చేయాలని సూచించారు. పదవ షెడ్యూల్‌లో పేర్కొ న్న 42 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పనితీరు విభజన తరువాత ఎలా ఉండేది నోట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఉద్యోగుల ప్రాంతీయత సిద్ధం
ఏ ప్రాంతం ఉద్యోగులు ఎవరు అనే సమాచారాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ సేకరించింది. మానవ వనరుల డేటా పేరుతో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు నమూనా పత్రాన్ని ఆన్ లైన్‌లో చేరవేసింది. ఆ నమూనాలో ఉద్యోగి పుట్టిన ఊరు, జిల్లా, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికత వివరాలను పొందుపరిచింది. ఆ మేరకు ఇప్పటికే చాలామంది ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్‌లో చేరాయని ఆర్థిక శాఖ ఉద్యోగులు టక్కర్‌కు సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,67,000 కోట్లుగా ఆర్థిక శాఖ లెక్కకట్టింది. ఇందులో కేంద్రం ద్వారా చేసిన అప్పు 1,34,002 కోట్ల రూపాయలు కాగా విదేశీ సంస్థల నుంచి చేసిన అప్పు 5,948 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు తదితర సంస్థల నుంచి చేసిన అప్పు 9.309 కోట్ల రూపాయలుగా తేల్చారు. ఈ మొత్తం అప్పును జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని టక్కర్ సూచించారు.
ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు వివిధ సంస్థల నిధుల లెక్కలు తేల్చడంపై ఆర్థిక శాఖ అధికారులు అకౌంటెంట్ జనరల్ కార్యాలయం సహాయం తీసుకుంటున్నారు. అలాగే ఇంధన శాఖ, రహదారులు-భవనాలు, విద్యాశాఖ, సాగునీటి, పంచాయతీరాజ్, పరిశ్రమలు, రెవెన్యూ, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల అధికార యంత్రాంగం అంతా కూడా బిల్లులో పేర్కొన్న మేరకు రాష్ట్ర విభజన జరిగితే ఏ రాష్ట్రానికి ఏం వస్తాయనే వివరాలను జిల్లాల వారీగా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వివరాలన్నింటినీ శుక్రవారం నాటికల్లా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఆయా శాఖల అధికారులు అందజేయనున్నారు.