విజయవాడ: విజయవాడ గాంధీనగర్లోని శైలజా సినిమా థియేటర్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ విషయాన్ని గమనించిన భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఆ థియేటర్ యాజమాన్యం థియేటర్కు చేరుకున్నారు. సీలింగ్ లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామని వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
అయినా థియేటర్ యాజమాన్యం మాత్రం స్పందించలేదని తెలిపారు. ఇటువంటి థియేటర్స్పై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సినిమా ప్రదర్శన జరుగుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఉంటే భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. థియేటర్ యాజమాన్యానికి నోటీలసు జారీ చేస్తామని చెప్పారు.