మండలంలోని రామచంద్రాపురం కొట్టాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురే విద్యార్థులున్నారు.
పత్తికొండ టౌన్: మండలంలోని రామచంద్రాపురంకొట్టాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురే విద్యార్థులున్నారు. పాఠశాలలో 13మంది విద్యార్థులు చదువుతున్నట్లు రికార్డుల్లో ఉన్నా వాస్తవంగా బడికివస్తోంది ఐదుమందే. ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35మందికి కనీసం ఒక ఉపాధ్యాయుడు పని చేయాలనే ప్రభుత్వ విధానం అమలుకు విద్యాశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీని ప్రకారం పాఠశాల మూతపడే అవకాశం ఉంది. పాఠశాలలో ఏకోపాధ్యాయుడు ఉమ్లానాయక్ పాఠాలు బోధిస్తున్నారు. అలాగే మండలంలో రామచంద్రాపురం పాఠశాలలో 13మంది, కురువలదొడ్డి పాఠశాలలో 16మంది, జె. అగ్రహారం పాఠశాలలో 26మంది, కనకదిన్నె పాఠశాలలో 27మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని టీచర్ల పోస్టులు రద్దుచేస్తే పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది.
రేషలైజేషన్ అమలైతే మూతపడుతుంది- ఆర్. కబీర్, మండల విద్యాధికారి
ప్రతి పాఠశాలలో కనీసం 15మంది విద్యార్థులైనా ఉంటే ఒక ఉపాధ్యాయుడిని కొనసాగించవచ్చు. రేషలైజేషన్ నిబంధన అమలైతే మండలంలోని రామచంద్రాపురంకొట్టాల ప్రాథమిక పాఠశాల మూతపడే అవకాశం ఉంది.