తిరుమలలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్
- కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
- ప్రత్యేక బృందాలతో గాలింపు
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. అనంత పురం జిల్లా కనగనపల్లి మండలం తుముచెర్లకు చెందిన మహాత్మ, వర లక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ (5), కుమారుడు హర్ష వర్దన్ (3)తో కలసి శని వారం తిరుమల వచ్చా రు. గదులు లభించకపో వడంతో మాధవం యాత్రిసదన్‌లోని ఐదో నంబరు హాలులో 1016 లాకర్ తీసుకున్నారు. రాత్రి శ్రీవారి దర్శనానికెళ్లి ఆదివారం ఉదయం 6కు తిరిగి యాత్రిసదన్‌కు చేరుకున్నారు. కుటుంబమంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్న నవ్యశ్రీ(5)పై దుప్పటి ముసుగేసి కిడ్నాప్ చేశాడు. ఉదయం 8 తర్వాత నిద్రలేచిన తల్లిదండ్రులకు బిడ్డ కనిపించకపోవడంతో షాక్‌కుగురయ్యారు. యాత్రిసదన్ లోపల, వెలుపల గాలించినా చిన్నారి ఆచూకీ లభించ లేదు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మునిరామయ్య, సీఐ వెంకటరవి ఘటనాస్థలానికి చేరుకుని యాత్రిసదన్–2లోని సీసీ కెమెరా రికార్డు లను పరిశీలించారు. ఉదయం 7.40కు పసుపురంగు టీ షర్ట్, నీలిరంగు జీన్స్ ప్యాంటు ధరించిన ఆగంతకుడు ముఖం కనిపించకుండా ఆ చిన్నారిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు గుర్తించారు. ఆ చిత్రాలను మీడియాకు విడుదల చేశారు.నవ్యశ్రీ కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తిరుమల డీఎస్పీ మునిరామయ్య తెలిపారు.