నగరంపై నుంచి వెళ్తున్న విమానం
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతతకు మారుపేరు విశాఖ నగరం. హాయిగొలిపే వాతావరణం, ప్రకృతి సౌందర్యం, సాగరతీరం ఈ మహానగరం సొంతం. అందుకే ఎక్కడెక్కడో పదవీ విరమణ చేసిన వారు కూడా ఇక్కడే శేష జీవితం గడపాలని కోరుకుంటారు. వందల సంఖ్యలో ఉన్న ఆస్పత్రుల్లో వేలాది మంది రోగుల నిత్యం వైద్యం పొందుతుంటారు. అలాంటి విశాఖలో పౌర, యుద్ధ విమానాలు రకరకాల శబ్దాలతో జనానికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా యుద్ధ విమానాలు చెవులు చిల్లులుపడేలా రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతూ కంటిమీద కునుకులేకుండాచేస్తున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు విమానాల తాకిడి రోజు రోజుకు అధికమవుతోంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసులూ పెరుగుతున్నాయి. ప్రస్తు తం రోజుకు నగరం మీదుగా 70కి పైగా పౌర విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శిక్షణలో భాగంగా 130కి పైగా వివిధ రకాల యుద్ధ విమానాలు భారీ శబ్దాలు, విన్యాసాలతో హోరెత్తిస్తున్నా యి. వెరసి విశాఖ విమానాశ్రయం, నేవీ విమానాశ్రయం ఐఎన్‌ఎస్ డేగాకు రోజుకు 200 వరకు విమానాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
సమీప భవిష్యత్‌లో ఈ సంఖ్య 300కు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ఇటు పౌర విమానయాన సంస్థలు, అటు నావికాదళం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వాస్తవానికి పౌర విమానాలకంటే రక్షణశాఖ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యమే ఎక్కువగా ఉంటుంది. ఇది మనిషి భరించే స్థాయికంటే రెట్టింపు ఉండడమే ఇప్పుడు విశాఖ వాసుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఒక మనిషి 80 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని భరించగలుగుతాడు. పౌర విమానాల వచ్చే శబ్ద కాలుష్యం 120 డెసిబుల్స్, అదే యుద్ధ విమానాలైతే మరింత ఎక్కువగాను ఉంటుంది. రోజులో 45 నిమిషాల పాటు 120 డెసిబుల్స్‌కు మించి శబ్దం వెలువడితే బధిరత్వం సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతుల కంటే రోగులకు శబ్ద కాలుష్యం మరింతగా ప్రభావం చూపుతుంద ని వీరు పేర్కొంటున్నారు. విశాఖలో పలు ప్రభు త్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో వేల సంఖ్యలో రోగులు చికిత్స పొందుతుం టారు. వీరు కాకుండా అనారోగ్యంతో ఇళ్లలో ఉం టున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారంతా శబ్ద కాలుష్యం బారిన పడక తప్పదని చెబుతున్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులోవాయిస్ కంప్‌లైంట్ సెల్‌తో..
విమానాల నుంచి వెలువడే అధిక శబ్దాల వల్ల స్థానికులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు తలెత్తే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ తాజాగా వాయిస్ కంప్‌లైంట్ సెల్ ఏర్పాటు చేసింది. అలాంటి సెల్‌ను విశాఖలోనూ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment