ఈ మధ్య రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లుపడే శబ్దంతో వెళుతున్న ద్విచక్రవాహనాలు ఎక్కువయ్యాయి. కంపెనీ నుంచి కొనేప్పుడు వాహనాలకు ఉన్న సైలెన్సర్లు (పొగ గొట్టాలు) తొలగించి వాటిని ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి దడపుట్టిస్తున్నారు. 90 శాతం వాహనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మనిషి సాధారణంగా 60 డెసిబుల్స్ శబ్దం వరకు వినగలదు. 120 డెసిబుల్స్ కన్నా ఎక్కువగా వినడం చెవుడుకు దారితీస్తుంది. ఆకతాయిలు చేస్తున్న ఇలాంటి న్యూసెన్స్‌పై పోలీసులు కేసులు నమోదు చేసి.. తగిన చర్యలు తీసుకుంటున్నారు.
– దొండపర్తి(విశాఖ దక్షిణ)
విశాఖ జిల్లాలో వాహనాల శబ్ద కాలువ్యం ఎక్కువైంది. రోడ్డుపైకి వెళ్లాలంటే వృద్ధులు, మహిళలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనం వేగం పెరిగితే అది వెలువరించే శబ్దం బాగా పెరుగుతుంది. శబ్దాన్ని డెసిబుల్స్‌లో కొలుస్తారు. మోటారు వాహనాల చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రతి వాహనం నిర్ణీత శబ్దాన్ని వెలువరించేలా, దాని సైలెన్సర్‌ను తీర్చిదిద్దుతారు. అలాంటి డిజైన్లకే రవాణా శాఖ అనుమతి ఇస్తుంది. కంపెనీ సైలెన్సర్లకు ఒక సీరియల్ నంబర్ కూడా ఉంటుంది. దాని ద్వారా కంపెనీ సైలెన్సర్‌ను గుర్తించవచ్చు. ఇలా కాకుండా వాటిలో ఏమైనా మార్పులు చేసినా, రవాణా శాఖ అనుమతి లేని వాటిని వాడినా శబ్ద తీవ్రత మారిపోతుంది.
ఉలిక్కి పడాల్సిందే..
బుల్లెట్ వాహనాలు దర్జాకు ప్రతీకగా నిలుస్తున్నాయి. కేటీఎం కుర్రకారుకు క్రేజ్‌గా మారుతున్నాయి. అలాగే పాతబడ్డ యమహా ఆర్‌ఎక్స్ –100 వాహనాలకు రంగులద్ది రోడ్లపై తిప్పుతున్నారు. ఈ వాహనాల సైలెన్సర్లలో కొద్దిపాటి మార్పు చేస్తే అది వెలువరించే శబ్దం ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తూ.. ఎదుటివారి ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోకుండా రోడ్లపై వాహనాలను నడుపుతుండడం దడ పుట్టిస్తోంది. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లలో కొంత మంది మార్పులు చేస్తుంటే.. మరికొంత మంది దానిని పూర్తిగా మార్చేసి అధిక శబ్దం వచ్చే వాటిని బిగించుకుంటున్నారు. ఇది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరమని గుర్తించలేకపోతున్నారు. బుల్లెట్, ఆర్‌ఎక్స్–100 లాంటి వాహనాల నుంచి ఒక్కోసారి బాంబు పేలిన శబ్దం వస్తుంటుంది. యువత దీన్ని క్రేజ్‌గా భావిస్తున్నారు. వాహనం రన్నింగ్‌లో ఉన్నప్పుడు దానిలో కొన్ని మార్పులు చేస్తే బుల్లెట్ సైలెన్సర్ నుంచి బాంబు పేలిన శబ్దం వస్తుంది. పక్క నుంచి వెళ్తూ ఒక్కసారిగా ఇలాంటి శబ్దం వస్తే ఎంతటి వారైనా ఉలిక్కిపడాల్సిందే. గుండె జబ్బులున్న వారిపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్కో సైలెన్సర్ ఒక్కో శబ్దం
ద్విచక్రవాహనాలకు రకరకాల సైలెన్సర్లు బిగిస్తున్నారు. ఒక్కో మోడల్ సైలెన్సర్ ఒక్కో రకమైన శబ్దం విడుదల చేస్తుంది. దాన్ని బట్టి వాటికి ప్రత్యేకమైన పేర్లు పెట్టారు. అడవి పంది అరుపులా ఉంటే దానికి వైల్డ్‌బోర్ ఎగ్జాస్ట్ అన్ని పేరు పెట్టారు. మరొకటి మర తుపాకీలా గిర్రున తిరుగుతూ శబ్దం వెలువరిస్తే దానిని ‘టెయిల్ గన్నర్’ అంటారు. వీటితో పాటు బ్యారెల్, గ్రీసెస్, మెగా ఫోన్, కాక్‌టైల్ షార్మర్, ఇండోరి, పంజాబీ, డాల్ఫిన్, ఆర్‌ఆర్‌ఓ పేరిట స్పేర్‌పార్ట్ దుకాణాల్లో సైలెన్సర్లు లభిస్తున్నాయి.
సైలెన్సర్ మార్చినా..
మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు నమోదు చేస్తారు. కొంత మంది నిబంధనలను ఉల్లంఘించి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు తీసేసి వేరే వాటిని బిగిస్తున్నారు. మరికొందరు కంపెనీ సైలెన్సర్లు ఉంచినా దానిలో ఉండే పలు ఫిల్టర్లు తీసేస్తున్నారు. దీని వల్ల శబ్ద తీవ్రత పెరుగుతుంది. ఇది కూడా నేరమే అంటున్నారు పోలీసు అధికారులు. ఇలాంటి ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
చట్టం ఏ చెబుతుందంటే..
► ఒక వాహనం నిర్ణీత డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం సృష్టిస్తే అది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం.
► నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనంపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయవచ్చు.
► సంబంధిత వాహన చోదకుడికి రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేయవచ్చు.
► రెండోసారి శబ్ద కాలుష్యానికి కారణమైతే రూ.2 వేల వరకు జరిమానా విధిస్తారు.
తీవ్రత పెరిగిందా జబ్బులు ఖాయం
మనం వింటున్న శబ్ద తీవ్రత పెరిగే కొద్దీ జబ్బులు ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. 100 డెసిబుల్స్ దాటిన ఏ శబ్దమైనా గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
► 110 డెసిబుల్స్ దాటితే.. చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది.
► 120 డెసిబుల్స్ దాటితే.. చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది.
► 160 డెసిబుల్స్ దాటితే.. చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతిని కొంతస్థాయిలో శాశ్వతంగా వైకల్యం ఏర్పడుతుంది.
► 190 డెసిబుల్స్ దాటితే.. కర్ణ భేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపుస్థితి తీసుకురావడం చాలా కష్టం.
అవగాహన కల్పిస్తున్నాం.. వినకపోతే కేసులు పెడతాం
వాహనాలకు సైలెన్సర్లు మార్చడం చట్టరీత్యా నేరం. దీనికి తోడు రోడ్లపై ఇష్టం వచ్చిన రీతిలో వాహనాల ద్వారా సౌండ్ చేస్తూ వెళ్లడం న్యూసెన్స్ అవుతుంది. వీటిపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. ఇప్పటికే ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవలే ఇటువంటి వాహనాల సైలెన్సర్లను తొలగించడం జరిగింది. వాహనదారులు కంపెనీ సైలెన్సర్లు మాత్రమే ఉంచుకోవాలి. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- సి.హెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్
సాధారణ ధ్వని స్థాయి 60 నుంచి 70 డెసిబుల్స్.
నమోదవుతున్న ధ్వని స్థాయి 80 నుంచి 120.
ఫలితంగా జాతీయ రహదారులు, నగరంలోని ప్రధాన రహదారుల పక్కన నివసిస్తున్న వారి చెవులు చిల్లులు పడుతున్నాయి. ఉదయం 8 గంటల మొదలు రాత్రి 10 వరకు వాహనాల శబ్దాలు హడలెత్తిస్తున్నాయి. (క్లిక్: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు)
Comments
Please login to add a commentAdd a comment