నగరంలో ఆలయాలన్నీ కూలగొట్టిన తర్వాత మంత్రుల కమిటీ వేయడం ఎందుకని ఏపీ శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.
విజయవాడ: నగరంలో ఆలయాలన్నీ కూలగొట్టిన తర్వాత మంత్రుల కమిటీ వేయడం ఎందుకని ఏపీ శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా పర్యటనలో ఉండి రాష్ట్రంలో ఏ మూల వర్షం పడిందో తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడలో జరిగిన ఆలయాల కూల్చివేత గురించి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డం పడుతున్నాయని పదేపదే ఆరోపిస్తున్న చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు.
టీడీపీ పాలనపై అన్నివర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మంత్రివర్గంలో దేవాదాయశాఖ పనిచేస్తోందా అన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండానే దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఆలయాలకు భద్రత కరువైందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రపంచమంతా స్విస్ చాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే ఆ విధానం అద్భుతం, అమోఘం అంటూ బాబు చెప్పడం ఆయన అవినీతి బుద్దికి నిదర్శనమని అన్నారు.