
చినుకు కురిసింది..నేల మురిసింది
- ఏజెన్సీలో భారీ వర్షం
- ముంచంగిపుట్టులో 5.9 సె.మీ. నమోదు
- మైదానంలో ముసురు
- ఖరీఫ్‌కు మేలు
విశాఖ రూరల్/పాడేరు : అంతటా వర్షంతో జిల్లా తడిసి ముద్దయింది. ఖరీఫ్‌కు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురించాయి. అంతా పొలంబాట పడుతున్నారు. అల్పపీడనంతో శుక్రవారం వేకువ జాము నుంచే ముసురు వాతావరణం నెలకొంది. చాన్నాళ్ల తర్వాత ఊరట కలిగింది. ముంచంగిపుట్టు మండలంలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏజెన్సీ అన్ని మండలాల్లోనూ భారీ వర్షంతో పంట భూముల్లో నీటి నిల్వలు పెరిగాయి. ఇంత కాలం
వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఖరీఫ్ సాగు మందగించింది. నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో జిల్లాలో ఈ సీజన్‌లో మొత్తం 2,27,400 హెక్టార్లలో ఇప్పటి వరకు కేవలం 15 శాతం మేర మాత్రమే పంటలు వేశారు. జూన్ చివరి నాటికి అన్ని రకాల పంటలు కలిపి 32,189 హెక్టార్లలో మాత్రమే చేపట్టారు. ముఖ్యంగా లక్షా 10 వేల హెక్టార్లలో వరి లక్ష్యం కాగా కేవలం 200 హెక్టార్లలోనే సాగయింది. గతేడాది ఇదే సమయానికి 40 శాతం నాట్లు పడగా, ప్రస్తుతం 3 నుంచి 4 శాతమే నారుపోతలయ్యాయి. ఈ నెలలో సాధారణ వర్షపాతం 197.3మిల్లీమీటర్లు. ఇప్పటి వరకు 60.2 మి.మీ. వర్షం కురిసింది.
45 శాతం వరిసాగు
జిల్లాలో ఇప్పటి వరకు 45 శాతం మేర నారుపోతలు పూర్తయ్యాయి. ఏజెన్సీలో కాస్తా అనుకూలించడంతో 55 శాతం సాగు ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో మాత్రం 25 నుంచి 30 శాతం మేర నారుపోతలు పూర్తయినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వరికి సంబంధించి 19,880 క్వింటాళ్లు విత్తనాలు సిద్ధం చేయగా 17,100 క్వింటాళ్లు అమ్ముడయ్యాయి. ఇంకా విత్తనాలు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఇదే స్థాయిలో వర్షాలు పడితే ప్రత్యామ్నాయ పంటల కోసం,స్వల్పకాలిక వంగడాల కోసం ఎదురుచూడాల్సిన అవసరముండదని చెబుతున్నారు.
ముంచంగిపుట్టులో 59.8 మిల్లీమీటర్లు, పెదబయలులో 31.2 మి.మీ, హుకుంపేటలో 16.2 మి.మీ, డుంబ్రిగుడలో 6.6 మి.మీ, అరకులోయలో 19.2 మి.మీ, పాడేరులో 32.6 మి.మీ, అనంతగిరిలో 16.4 మి.మీ, జి.మాడుగులలో 11.2 మి.మీ, చింతపల్లిలో 13.2 మి,మీ, జికేవీధిలో 15.4 మి.మీ, కొయ్యూరులో 3.4 మి.మీ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో భారీ వర్షం కురవగా కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడింది. పాడేరు ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది.
ఈ వర్షంతో పాడేరు సంతదారులు ఇబ్బందులకు గురయ్యారు. మెట్ట, కొండపోడు సాగుకూ ఈ వర్షాలు అనుకూలం. జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈపీడీసీఎల్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.