
ఏజెన్సీలో ఆగని వర్షం
- డొంకరాయి గేట్లు ఎత్తివేత
- 26 క్యూసెక్కుల నీరు విడుదల
- ముంచంగిపుట్టులో 126.2 మి.మీటర్లు
సీలేరు : ఏజెన్సీలో ఆదివారం కూడా భారీ వర్షం పడింది. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతుండడంతో అక్కడక్కడ లోత ట్టు ప్రాంతాల్లోని వరినారుమడులు దెబ్బతిన్నాయి. కొండగెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సీలేరు, దారకొండలో జరిగిన వారపుసంతలకు భారీ వర్షం అడ్డంకిగా మారింది. దారాలమ్మ ఘాట్‌లో నాలుగు భారీ చెట్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ముంచంగిపుట్టులో 126.2 మిల్లీమీటర్లు, పెదబయలు 102.6, హుకుంపేట 48.8, డుంబ్రిగుడ 68.2, అరకులో 31.4, అనంతగిరిలో 11.6, పాడేరులో 29.2, జి.మాడుగులలో 26.4, చింతపల్లిలో 28.2, జి.మాడుగులలో 32.4, కొయ్యూరు 31 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని డొంకరాయి జలాశయంలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. రిజర్వాయర్‌లో పూర్తి నీటి మట్టం 1037 అడుగులు. జలాశయం ఎగువన ఉన్న పాలగెడ్డ, మంగంపాడు, వలసగెడ్డల నుంచి భారీగా వరదనీరు వచ్చిపడడంతో శనివారం రాత్రి ఒంటిగంటకు పూర్తిగా నిండిపోవడంతో జెన్‌కో అధికారులు ఎకాయెకిన నాలుగు గేట్లు ఎత్తి సుమారు 26వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం ఉదయం 6 గంటల వరకు విడుదల చేశారు. అడుగు నీరు తగ్గడంతో మరో రెండు గేట్లు మూసివేసి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 6 వేలు క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతున్నందున జెన్‌కో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
డుడుమ నుంచి నీరు విడుదల
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ(డైవర్షన్) డ్యాంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ఆదివారం డుడుమ డ్యాం గేట్లు ఎత్తి దిగువనున బలిమెల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. 8వ నంబరు గేటు ద్వారా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2690 అడుగులు. ప్రస్తుతం 2588 అడుగుల నీరు నిల్వ ఉంది. జోలాపుట్టులో ప్రధాన రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులు. ప్రస్తుతం 2722 అడుగుల నీటి మట్టం నమోదైంది.
మైదానంలో తెరిపిచ్చిన వాన!
సాక్షి, విశాఖపట్నం : నాలుగు రోజుల పాటు కుమ్మరించిన వాన ఆదివారం నాటికి తెరిపిచ్చింది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తొలుత రెండు రోజులు భారీ వర్షం కురిసింది. తర్వాత అది బలపడి వాయుగుండంగా మారడంతో శుక్ర, శనివారాల్లో ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ కుంభవృష్టి కురిసింది. శ నివారం ఉదయం వరకు విశాఖ నగరంలో 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగర రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గెడ్డలు పొంగిపొర్లాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అదేపనిగా కురిసిన జడివానలకు జడిసి జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే ఇబ్బందిపడ్డారు.
రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఉపాధి పొందే చిరువ్యాపారులకు వ్యాపారాలు సాగలేదు. జిల్లాలోను, ఏజెన్సీలోనూ వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవ హించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు జలాశయాల్లోకి భారీగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వాయుగుండం తీరం దాటింది. ఫలితంగా ఉదయం నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. ఉదయమే సూర్యుడు మబ్బుల మాటు నుంచి బయటకు వచ్చాడు. రోజంతా వాన కురవలేదు. ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దీంతో ఊపిరి పీల్చుకున్న జనం యధావిధిగా తమ కార్యకలాపాలకు సాగించుకున్నారు.